న్యూఢిల్లీ: అనుమతి లేని కళాశాలలు, కోర్సుల్లో చేరొద్దని జాతీయ వైద్య మండలి(ఎన్ఎంసీ) వైద్య విద్యార్థులను మంగళవారం హెచ్చరించింది. ఇలాంటి కాలేజీల్లో చదవడం వల్ల ఎఫ్ఎంజీఈ లైసెన్సింగ్ పరీక్షకు అనర్హులవుతారని తెలిపింది. ఇలాంటి కాలేజీలు తమకు గుర్తింపు ఉందని విద్యార్థులు, వారి తల్లిదండ్రులను తప్పు దోవ పట్టిస్తూ అడ్మిషన్లను ఆఫర్ చేస్తున్నాయని పేర్కొంది. ఆయా కళాశాలల చట్టబద్ధ గుర్తింపును ధృవీకరించుకొనేందుకు ఎన్ఎంసీ అధికారిక వెబ్సైట్లోని అనుమతి పొందిన కళాశాలల జాబితాను పరిశీలించాలని కోరింది. అవసరమైతే నేరుగా తమను సంప్రదించొచ్చచి చెప్పింది.
కాలేజీల వెబ్సైట్లు, ప్రకటనల మీద ఆధారపడొద్దని, మెడికల్ కాలేజీల్లో ప్రత్యక్ష అడ్మిషన్లను ఎన్ఎంసీ చేపట్టదని తెలిపింది. మరింత సమాచారం కోసం +91-11-25367033 ఫోన్ నంబర్లో తమను సంప్రందించాలని కోరింది. విదేశీ వైద్య విద్య పట్టభద్రుడిగా(ఎఫ్ఎంజీఎల్) గుర్తింపు పొందాలంటే ఒకే కళాశాలలో కనిష్ఠంగా 54 నెలల వైద్య విద్యను, అదే విదేశీ విశ్వ విద్యాలయంలో 12 నెలల ఇంటర్న్షిప్ను పూర్తి చేసి ఉండాలని తెలిపింది. మరోవైపు విదేశీ వైద్య పట్టభద్రులు భారత్లో కనిష్ఠంగా 12 నెలల పాటు పర్యవేక్షణ కలిగిన ఇంటర్న్షిప్ను పూర్తి చేస్తే వారికి శాశ్వత రిజిస్ట్రేషన్ చేస్తామని తెలిపింది.