కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన.. దేశంలో మహిళల భద్రతపై మరోసారి చర్చను లేవనెత్తింది. 2012లో దేశంలో సంచలనం సృష్టించిన నిర్భయ ఘటన అనంతరం లైంగిక దాడులకు వ్యతిరేకంగా కఠిన చట్టాలు, నిబంధనలు తీసుకొచ్చినా ఈ కీచకపర్వానికి మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. దేశంలో గంటకు సగటున నలుగురు మహిళలు అఘాయిత్యాలకు బలవుతున్నారంటే పరిస్థితి ఏవిధంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు.
Women Safety | న్యూఢిల్లీ, ఆగస్టు 18: పని ప్రదేశాలు, ఇండ్లు, బయట.. ఇలా ఎక్కడ కూడా మహిళలకు రక్షణ లేకుండా పోయింది. దేశంలో మహిళలపై ఆఘాయిత్యాలు పెరుగుతున్నాయని, దేశంలో ప్రతి గంటకు సగటున నలుగురు లైంగిక దాడులకు గురవుతున్నారని అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2017-2022 మధ్య రోజుకు సగటున 86 రేప్ కేసులు నమోదవుతుండగా, 82 కేసుల్లో రేపిస్టులు బాధిత మహిళలకు తెలిసిన వాళ్లే కావడం మరింత ఆందోళన కలిగిస్తున్నది. 2017-2022 మధ్య దేశంలో మొత్తం 1.89 లక్షల లైంగిక దాడుల కేసులు నమోదయ్యాయని, ఇందులో 1.91 లక్షల మంది బాధితులుగా ఉన్నారని జాతీయ నేర గణాంకాల సంస్థ(ఎన్సీఆర్బీ) నివేదిక వెల్లడించింది. 1.79 లక్షల కేసుల్లో తెలిసిన వాళ్లే మహిళలపై లైంగిక దాడులకు పాల్పడటం గమనార్హం. దేశంలో భారీ సంఖ్యలో మహిళలపై లైంగిక దాడులు చోటుచేసుకుంటుంటే.. నిందితులకు శిక్ష పడుతున్న కేసులు చాలా తక్కువగా ఉంటున్నాయి. 2014-2022 మధ్య శిక్ష రేటు 27-28% శాతం మధ్యనే ఉన్నదని ఎన్సీఆర్బీ గణాంకాలు పేర్కొన్నాయి.
2022లో దేశవ్యాప్తంగా 31,516 లైంగిక దాడి కేసులు నమోదు కాగా, రాజస్థాన్‌లో అత్యధికంగా 5,399 నమోదయ్యాయి. తర్వాతి స్థానాల్లో మధ్యప్రదేశ్(3,029), మహారాష్ట్ర(2,904), యూపీ(3,690), ఢిల్లీ(1,212) ఉన్నాయి. ప్రతి లక్ష జనాభాకు చూస్తే ఉత్తరాఖండ్‌లో అత్యధికంగా లైంగిక దాడులు 15 ఉన్నాయి. తర్వాతి స్థానాల్లో 14 చొప్పున రాజస్థాన్, చంఢీగఢ్, హర్యానాలో 13, ఢిల్లీ, లక్షద్వీప్‌లో 12 చొప్పున ఉన్నాయి. మొత్తంగా 2022లో దేశంలో ప్రతి లక్ష జనాభాకు ఐదుగురు లైంగిక దాడులకు గురయ్యారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
పని ప్రదేశాలు, ఆఫీసుల్లో కూడా మహిళలకు భద్రత లేకుండా పోయింది. యజమానులు, సహచర ఉద్యోగులే మహిళలపై ఆఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. పని ప్రదేశాల్లో రోజుకు సగటున ఒకరు చొప్పున లైంగిక వేధింపులకు గురవుతున్నారని ఎన్సీఆర్బీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
2012లో ఢిల్లీ సామూహిక లైంగిక దాడి, హత్య ఘటన తర్వాత కేంద్రం నిర్భయ ఫండ్‌ను ఏర్పాటు చేసింది. మహిళల భద్రతకు ఉద్దేశించిన ఈ నిధులను పూర్తిస్థాయిలో వినియోగించక పోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరం నాటికి నిర్భయ ఫండ్‌కు రూ.7,213 కోట్లు కేటాయించగా, 2023, డిసెంబర్ 8 నాటికి రూ.5,119 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. అంటే దాదాపు 30 శాతం నిధులను వినియోగించలేదు. ఖర్చు చేసిన నిధుల్లో కూడా రూ.1,435(28 శాతం) అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ వంటి 8 పెద్ద నగరాల్లోనే వినియోగించినట్టు కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ గణాంకాలు చెబుతున్నాయి.