న్యూఢిల్లీ: అత్యంత శక్తిమంతమైన క్యాటగిరీ-4 హరికేన్ ‘హెలెనా’ అమెరికాలో బీభత్సం సృష్టిస్తున్నది. తుఫాను కారణంగా సౌత్ కరోలినా, జార్జియా, ఫ్లోరిడా, నార్త్ కరోలినా, వర్జినీయా రాష్ర్టాల్లో 52 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది వరదల్లో చిక్కుకున్నారు. గంటకు 140 మైళ్ల వేగంతో వీస్తున్న గాలులు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి.
హరికేన్ గురువారం రాత్రి తొలుత ఫ్లోరిడాలోని బిగ్బెండ్ ప్రాంతాన్ని తాకింది. ఆ తర్వాత పలు రాష్ర్టాల్లో విధ్వంసం సృష్టించింది. వేలాదిమంది సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. ఐదు రాష్ర్టాల్లోని 3.5 మిలియన్ల మంది ప్రజలు చీకట్లోనే మగ్గుతున్నారు. టెన్నెస్సీలోని ఓ దవాఖానను వరదలు ముంచెత్తడంతో 54 మందిని అధికారులు రక్షించారు.