న్యూఢిల్లీ, జూలై 22: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల రెండవ రోజు మంగళవారం కూడా ఉభయ సభలలో విపక్ష సభ్యుల నిరసనలతో రభస కొనసాగింది. బీహార్లో ఓటరు జాబితా సవరణ, పహల్గాం ఉగ్రదాడి అనంతర పరిణామాలు, ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ ఆకస్మిక రాజీనామా వంటి అంశాలపై చర్చ జరగాలని పట్టుపట్టిన ప్రతిపక్ష సభ్యులు లోక్సభ, రాజ్యసభలో పెద్దపెట్టున నినాదాలు చేస్తూ నిరసనలు తెలియచేయడంతో గందరగోళ వాతావరణం నెలకొంది. పరిస్థితి సద్దుమణగక పోవడంతో ఉభయ సభలు బుధవారానికి వాయిదా పడ్డాయి. రాజ్యసభ ఉదయం సమావేశమైన కొన్ని నిమిషాలకే విపక్ష సభ్యుల నిరసనల మధ్య సభాధ్యక్ష స్థానంలో ఉన్న జ్ఞాన్శ్యాం తివారీ ఉప రాష్ట్రపతి ధన్ఖడ్ తన పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. కాగా, ఉదయం లోక్సభ సమావేశమైన వెంటనే బీహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై విపక్ష సభ్యులు చర్చకు పట్టుబట్టడంతో రెండుసార్లు సభ వాయిదాపడింది.
చర్చకు అనుమతిస్తామని కేంద్ర మంత్రి అర్జున్ రాం మేఘ్వాల్, స్పీకర్ స్థానంలో ఉన్న జగదంబికా పాల్ పదేపదే హామీ ఇచ్చినప్పటికీ విపక్ష సభ్యులు తమ నిరసనలను విరమించలేదు. పహల్గాం ఉగ్రదాడికి దారితీసిన భద్రతా లోపాలు, ఆపరేషన్ సిందూర్ తర్వాత విదేశాంగ విధానంలో తలెత్తిన వైఫల్యాలపై వెంటనే సభలో చర్చించాలని లోక్సభలో విపక్ష సభ్యులు డిమాండు చేశారు. మరోవైపు బీహార్ ఓటరు జాబితా సవరణ, ధన్ఖడ్ రాజీనామాపై చర్చ జరగాల విపక్షాలు డిమాండ్ చేశాయి. అయితే ప్రతిపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలు వేటినీ స్పీకర్ స్థానంలో ఉన్న హరివంశ్ ఆమోదించలేదు.
సభా కార్యకలాపాలు కొనసాగించడానికి అనుమతించాలని ఆయన విపక్ష సభ్యులకు విజ్ఞప్తి చేశారు. కాగా, ప్లకార్డులు సభలోకి తీసుకురామని హామీ ఇచ్చిన విపక్ష సభ్యులు మళ్లీ వాటిని సభలోకి తీసుకురావడంపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చలకు తాము సిద్ధమని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ విపక్ష సభ్యులు సభా సమయాన్ని వృథా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ఎంపీల చర్యను ఆయన ఖండించారు. సభ్యులు ఎంతకూ తగ్గకపోవడంతో సభను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. బుధవారం ఉదయం 11 గంటలకు లోక్సభ తిరిగి సమావేశం కానున్నది.