Layoffs | న్యూఢిల్లీ, జనవరి 11: నూతన సంవత్సరంలోనూ ఉద్యోగాల ఊచకోత కొనసాగుతున్నది. దిగ్గజ కంపెనీల నుంచి స్టార్టప్‌ల వరకూ అన్ని టెక్ కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. తాజాగా గూగుల్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, పేటీఎం సంస్థలు వందల మంది ఉద్యోగులపై వేటు వేశాయి. ప్రపంచ ఆర్థిక మందగమన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వందలాది కంపెనీలు లేఆఫ్‌లను ప్రకటిస్తున్నాయి. ఖర్చులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. రాబోయే నెలల్లో మరిన్ని ‘లే ఆఫ్’లు ఉంటాయని మెటా సీఈవో జుకర్‌బర్గ్ చెబుతున్నారు.
గూగుల్: అమెరికా టెక్నాలజీ న్యూస్ వెబ్సైట్ ‘ద వెర్జ్’ కథనం ప్రకారం, గూగుల్‌లో హార్డ్‌వేర్, ఇంజినీరింగ్, అసిస్టెంట్ టీమ్స్‌లలో తాజాగా కొన్ని వందల మందిని తొలగించడానికి కంపెనీ సిద్ధమైంది. ‘ఉద్యోగాల తొలగింపు గూగుల్‌లో సర్వసాధారణం’ అని కంపెనీ అధికార ప్రతినిధి కోట్నీ మెన్సినీ వ్యాఖ్యానించారు. సంస్థకు చెందిన ఫిట్‌బిట్, నెస్ట్, పిక్సెల్‌లలో సిబ్బందిని పెద్ద సంఖ్యలో తొలగించటం టెక్ రంగంలో సంచలనం రేపింది. ఏఆర్ రియాలిటీ విభాగంలో వందలాది మందికి పింక్ స్లిప్‌లు అందాయి.
ఫ్లిప్‌కార్ట్: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీగా ఎదిగిన ఫ్లిప్‌కార్ట్‌లో దాదాపు 22వేల మంది వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారు. దీంట్లో 5 నుంచి 7 శాతం (1500మంది) వరకు లే ఆఫ్‌లు ఉండొచ్చునని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. అంతేగాక ఫ్లిప్‌కార్ట్ ఏడాదిపాటు నియామకాల్ని ఆపేయనున్నదని ‘ఎకనమిక్స్ టైమ్స్’ కథనం పేర్కొన్నది.
యూనిటీ సాఫ్ట్వేర్: గేమ్ డెవలపర్స్‌కు టూల్స్‌ను అందించే ‘యూనిటీ సాఫ్ట్వేర్’, ప్రపంచవ్యాప్తంగా తమ కార్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందిలో 25 శాతం (1800 మంది) ఉద్యోగుల్ని తొలగించేందుకు ప్రణాళికను రూపొందించింది.
పేటీఎం: ఆంగ్ల దినపత్రిక కథనం ప్రకారం, ఇటీవల కాలంలో పేటీఎం సుమారుగా 1000 మంది ఉద్యోగుల్ని తొలగించింది. కొన్ని విభాగాల్లో సేవల్ని నిలిపివేస్తూ10 శాతం మంది సిబ్బందిపై వేటు వేసింది. ముందు ముందు వ్యయ నియంత్రణ చర్యలు ఉండబోతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఉద్యోగుల వేతనాల ఖర్చును 10-15 శాతం వరకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
కంపెనీ అంతర్గత నోట్ ప్రకారం, అమెజాన్ ఎంజీఎం, అమెజాన్ ప్రైమ్ వీడియోలో పనిచేస్తున్న వందలమంది అమెరికన్లు ఈ వారంలో ఉద్యోగాలు కోల్పోయారు. మరికొద్ది రోజుల్లో మిగతా దేశాల్లోనూ లే ఆఫ్‌లు ఉంటాయని తెలిసింది. దక్షిణ కొరియాలో కార్యకలాపాల్ని పూర్తిగా ఆపేస్తున్నది. అమెరికాలో వీడియో లైవ్ స్ట్రీమింగ్ సేవలు అందించే (సబ్సిడరీ కంపెనీ) ‘ట్విట్చ్’లో 500 మందిని తొలగించారు. గత ఏడాది 27 వేలమంది ఉద్యోగుల్ని అమెజాన్ తొలగించింది. మరోవైపు హాలీవుడ్ సినిమాలు, స్టూడియోలు కొనుగోలు చేయడానికి వేల కోట్ల రూపాయల్ని ఖర్చు చేస్తున్నది.