ఔరంగాబాద్/ముంబై/జాల్నా, సెప్టెంబర్ 11: మహారాష్ట్రలో మరాఠా కోటా ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. మరాఠా కోటా లక్ష్యంగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న ఉద్యమకారుడు మనోజ్ జరాంగే ఫ్లూయిడ్స్గానీ, నీళ్లుగానీ తీసుకోవడం లేదు. ఔషధాలను కూడా నిరాకరిస్తున్నారు. దీంతో ఆయన ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తున్నది. అయితే ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోవడంతో తాజాగా ఫ్లూయిడ్స్, ద్రవ పానీయాలను సైతం తీసుకోవడం లేదు. అంతేకాదు.. తన ఆరోగ్యాన్ని పరిశీలించడానికి వచ్చిన డాక్లర్ల బృందానికి సహకరించడం లేదు. దీంతో ఆయన నిరాహార దీక్ష చేస్తున్న జాల్నా సమీపంలోని అంతర్వాలితోపాటు చుట్టుపక్కల జిల్లాల్లోనూ ఉద్రిక్తత చోటుచేసుకున్నది. మరోవైపు మరాఠా కోటా ఉద్యమం తీవ్రరూపం దాల్చడంతో సీఎం ఏక్నాథ్ షిండే సోమవారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. అయితే ఈ సమావేశం ప్రారంభానికి ముందే జరాంగే మాట్లాడుతూ మరాఠా కోటాకు అనుకూలంగా అన్ని పార్టీలు గళం వినిపించాలని విజ్ఞప్తి చేశారు.