న్యూఢిల్లీ: వివిధ అంశాలపై విపక్ష సభ్యులు నిరంతరాయంగా నిరసనలు తెలియచేయడంతో ఎటువంటి కార్యకలాపాలు జరపకుండా లోక్‌సభ శుక్రవారం వరుసగా రెండో రోజు వాయిదాపడింది. ఫిబ్రవరి 1న సమర్పించిన కేంద్ర వార్షిక బడ్టెట్‌పై లోక్‌సభ శుక్రవారం కూడా ఎటువంటి చర్చ జరపలేదు. మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా అనంతరం లోక్‌సభ తిరిగి సమావేశం కాగా వెల్‌లోకి దూసుకువెళ్లి విపక్ష సభ్యులు నిరసన తెలిపారు. సభ్యులు ప్లకార్డులు పక్కనపెట్టి తమ స్థానాల వద్దకు వెళ్లాలని స్పీకర్ స్థానంలో ఉన్న కృష్ణ ప్రసాద్ తెన్నేటి విపక్షాన్ని అభ్యర్థించారు. సభ్యులు అందుకు నిరాకరించడంతో సభను సోమవారానికి వాయిదావేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
అంతకుముందు స్పీకర్ ఓంబిర్లా విపక్ష సభ్యుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ ఇలాగైతే తాను సభను నడపలేనంటూ ఆగ్రహం ప్రకటించారు. ప్రస్తుత సమావేశాల్లో 19 గంటల 13 నిమిషాల సమయం విపక్షాలు సృష్టించిన అవాంతరాల కారణంగా వృథా అయిందని ఆయన విమర్శించారు. విపక్ష సభ్యులు సభను అవమానిస్తున్నారని ఆయన మండిపడ్డారు. సోమవారం మధ్యాహ్నం నుంచి లోక్‌సభ సజావుగా సాగడం లేదు.
ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే అముద్రిత పుస్తకంలోని కొన్ని భాగాల ఆధారంగా కారవాన్ పత్రిక ప్రచురించిన ఓ వ్యాసాన్ని చదవడానికి ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రయత్నించగా స్పీకర్ అడ్డుకోవడంతో మొదలైన ఈ అవాంతరాలు శుక్రవారం సభ వాయిదాపడే వరకు కొనసాగాయి. 2020 నాటి భారత్-చైనా ఘర్షణను జనరల్ నరవణే తన అముద్రిత పుస్తకంలో ప్రస్తావించినట్లు చెప్పిన రాహుల్ ఆ అంశాలను సభలో ప్రస్తావించడానికి చేసిన ప్రయత్నాన్ని స్పీకర్‌తోపాటు మంత్రులు సైతం అడ్డుకున్నారు.