లక్నో, డిసెంబర్ 19: నిండా పదేండ్ల వయసు కూడా నిండని ఓ బాలుడి జీవితం సినిమా కథను మించిన మలుపులు తిరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని సహ్రాన్‌పూర్ జిల్లా పండౌలికి చెందిన మహ్మద్ నావెద్, ఇమ్రానా బేగం దంపతులకు షెహ్జాద్ ఆలం(10) కుమారుడు. 2019లో నావెద్ గుండెపోటుతో మరణించగా ఇమ్రానా కుమారుడిని తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఉత్తరాఖండ్‌లోని రూర్కీలో గల కలియార్ షరీఫ్ దర్గా వద్దకు వెళ్లి జీవించింది.
2021లో ఆమె కరోనాతో మరణించడంతో బాలుడు షెహ్జాద్ అనాథయ్యాడు. అప్పటి నుంచి దర్గా వద్ద భిక్షాటన చేస్తూ అక్కడే నివసిస్తున్నాడు. బాలుడి తాత మహమ్మద్ యాకుబ్ 2021లో మరణించాడు. మరణించే ముందు తన మనుమడి కోసం సుమారు రూ.2 కోట్ల విలువ చేసే ఇల్లు, భూమిని వీలునామా రాశాడు. దీంతో అతడి బంధువులు రూర్కీలో బాలుడిని గుర్తించి ఇంటికి తీసుకెళ్లారు.