
దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో విదేశీ ప్రయాణికులకు కేంద్రం కొత్త నిబంధనలు విధించింది. విదేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులు ఏడు రోజుల పాటు కచ్చితంగా హోం క్వారంటైన్లో ఉండాల్సిందేనని తేల్చి చెప్పింది. అంతేకాకుండా కొత్తగా విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం కేసులు అత్యధికంగా ఉన్న దేశాల నుంచి వచ్చిన వారు వారి శాంపిల్స్‌ను ఎయిర్‌పోర్టులోనే టెస్టింగ్ కోసం అందజేయాల్సి వుంటుంది. వాటి ఫలితాలు వచ్చిన తర్వాతే ఎయిర్పోర్ట్ నుంచి బయటికి పంపిస్తారు.
ఇక ఈ టెస్టుల్లో పాజిటివ్ అని తేలితే, వారి శాంపిల్స్‌ను ఒమిక్రాన్ టెస్టుల కోసం ల్యాబులకు పంపించనున్నారు. అంతేకాకుండా వారిని ఐసోలేషన్‌కు పంపిస్తారు. నెగెటివ్ వచ్చిన వారు వారం రోజుల పాటు ఇంట్లోనే క్వారంటైన్లో ఉండాలని, ఎనిమిదో రోజు ఆర్టీ పీసీఆర్ పరీక్షలు కచ్చితంగా నిర్వహించుకోవాలని కేంద్రం సూచించింది. ఇక ఎయిర్ సువిధ పోర్టల్‌లో సెల్ఫ్ డిక్లరేషన్ ఫారమ్‌ను కచ్చితంగా నింపాలని కేంద్రం నిబంధన విధించింది. దీంతో పాటు ప్రయాణానికి ముందే ఆర్టీపీసీఆర్ టెస్టు రిపోర్టును ఎయిర్‌పోర్టు సంబంధీకులకు ఇవ్వాలన్నది కేంద్రం విధించిన తాజా నిబంధన.