తిరువనంతపురం: కేంద్రం-రాష్ట్రప్రభుత్వం మధ్య సమస్యలు, రాష్ట్ర రుణ సమీకరణపై ఆంక్షల మీద ప్రధాని మోదీకి మెమొరాండం ఇవ్వాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. 2017కు ముందు అనుసరించిన రుణ పరిమితిని పునరుద్ధరించాలని కోరనుంది. రాజ్యాంగ నిబంధనలు, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం అనుసరిస్తున్న విధానాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఎల్డీఎఫ్ ప్రభుత్వం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ పూచీకత్తుతో ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న అప్పులను రాష్ట్ర ప్రభుత్వం నేరుగా తీసుకున్న అప్పులుగా భావించకూడదని, వాటిని భవిష్యత్తు అవసరాల కోసం చేసిన అప్పులుగానే పరిగణించాలని కేరళ కోరుతున్నది.