న్యూఢిల్లీ : నిరర్థక ఆస్తుల (ఎన్పీఏ) అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద కొన్ని రికార్డులను వెల్లడించవచ్చునని భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) చెప్పినప్పటికీ, కొన్ని బ్యాంకులు వ్యతిరేకిస్తున్నాయి. టాప్ 100 నిరర్థక ఆస్తులు (ఎన్పీఏలు), యెస్ బ్యాంక్ విల్ఫుల్ డిఫాల్టర్స్, ఎస్బీఐ, ఆర్బీఎల్ ఇన్స్పెక్షన్ రిపోర్టులు, బ్యాంక్ ఆఫ్ బరోడాపై విధించిన రూ.4.34 కోట్ల పెనాల్టీ వివరాల కోసం నలుగురు ఆర్టీఐ దరఖాస్తుదారులు వేర్వేరుగా ఆర్బీఐకి దరఖాస్తు చేశారు. ఆర్టీఐ చట్టం నిబంధనల ప్రకారం ఈ వివరాలను వెల్లడించవచ్చునని ఆర్బీఐ నిర్ణయించింది. అయితే, ఈ చట్టంలోని సెక్షన్ 11 ప్రకారం థర్డ్ పార్టీ సమ్మతి అవసరం కావడంతో, సంబంధిత బ్యాంకుల అభిప్రాయాలను ఆర్బీఐ కోరింది. దరఖాస్తుదారు కోరుతున్న సమాచారం ఏ పార్టీకి చెందినది అయితే ఆ పార్టీని ఈ విధంగా అభిప్రాయం కోరుతారు. ఆర్బీఐ అభిప్రాయాలను ఈ నాలుగు బ్యాంకులు కేంద్ర సమాచార కమిషన్లో సవాల్ చేశాయి.
రెగ్యులేటరీ ఇన్ఫర్మేషన్ను వెల్లడిస్తే, తమ వ్యాపార ప్రయోజనాలు దెబ్బతింటాయని ఆరోపించాయి. దరఖాస్తుదారు కోరిన సమాచారం సున్నితమైనది, రహస్యమైనది అని బ్యాంక్ ఆఫ్ బరోడా చెప్పింది. ఈ వాదనను ఆర్బీఐ తోసిపుచ్చింది. ఆర్బీఐ ఇన్స్పెక్షన్ రిపోర్టులను తప్పనిసరిగా వెల్లడించాలని జయంతిలాల్ ఎన్ మిస్త్రీ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పును పునఃపరిశీలించాలని సుప్రీంకోర్టును బ్యాంక్ ఆఫ్ బరోడా కోరింది. ఆర్బీఎల్ బ్యాంక్ 2013-14, 2016-17 ఆర్థిక సంవత్సరాల ఇన్స్పెక్షన్ నివేదికలను వెల్లడించాలని చెప్పడాన్ని వ్యతిరేకించింది. టాప్ 100 ఎన్పీఏలు, ఉద్దేశపూర్వక ఎగవేతదారులు, ప్రభుత్వ రంగ బ్యాంకుల తనిఖీల నివేదికలను వెల్లడించాలనడాన్ని యెస్ బ్యాంక్ వ్యతిరేకించింది. ఆర్బీఐ జారీ చేసిన ఎన్ఫోర్స్మెంట్ యాక్షన్స్, షోకాజ్ నోటీసులను వెల్లడించాలని చెప్పడాన్ని ఎస్బీఐ వ్యతిరేకించింది. దీంతో కేంద్ర సమాచార కమిషన్ ఈ కేసులను సీఐసీలోని విస్తృత ధర్మాసనానికి నివేదించింది. రిపోర్టులను వెల్లడించడాన్ని తాత్కాలికంగా నిలిపేసింది.