న్యూఢిల్లీ, మే 2: ఎండలతో అల్లాడుతున్న పౌరులకు భారత వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. సాధారణంగా వచ్చే దానికన్నా ముందే ఈ సంవత్సరం నైరుతి రుతుపవనాలు భారత్‌ను పలకరిస్తాయని తెలిపింది. ఈ నెల 14-16 తేదీల మధ్య నైరుతి రుతు పవనాలు అండమాన్ వచ్చే సూచనలున్నాయని వెల్లడించింది. పలు రీజియన్లలో సాధారణం కంటే అధిక స్థాయిలో వేడి గాలుల దినాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని, దేశంలోని మరికొన్ని చోట్ల ఈ నెలలో సాధారణ స్థాయి కంటే ఎక్కువగా వర్షపాతం నమోదవుతుందని వెల్లడించింది.
గుజరాత్ లోని సౌరాష్ట్ర, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని దక్షిణ ప్రాంతాలు, ఉత్తర ఉత్తర ప్రదేశ్, బీహార్, తమిళనాడు, ఒడిశా సహా కోస్తా రాష్ర్టాల్లో సాధారణం కంటే ఎక్కువ స్థాయిలో వడగాల్పులు వీస్తాయని తెలిపింది. దేశంలో రాత్రి పూట సాధారణం కంటే ఎక్కువ నమోదు కావచ్చునని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర వెల్లడించారు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రవేశించినా, ముందుగానే నిష్క్రమిస్తాయని చెప్పలేమన్నారు.