Corona Update | దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకు విస్తరిస్తున్నది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 6వేల మార్క్‌ని దాటింది. గత 24గంటల్లో ఆరుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. కేరళలో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. ఆ రాష్ట్రంలో 1950 కేసులున్నాయి. గత 24 గంటల్లో 144 కేసులు పెరిగాయి. ఆ తర్వాత గుజరాత్ రెండోస్థానంలో ఉన్నది. ఈ రాష్ట్రంలో 822 కేసులు ఉండగా.. ఢిల్లీలో 686, మహారాష్ట్రలో 595, కర్ణాటకలో 366, ఉత్తరప్రదేశ్‌లో 219, తమిళనాడులో 194, రాజస్థాన్‌లో 132, హర్యానాలో 102 కరోనా కేసులు గుర్తించారు. 24 గంటల్లో కేరళలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఒకరు 51 సంవత్సరాల వయసు ఉండగా.. మరొకరికి 64, మూడో వ్యక్తికి 92 సంవత్సరాలు. ఈ ముగ్గురు ఇప్పటికే పలు వ్యాధులతో బాధపడుతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అలాగే, కర్నాటకలోనూ ఇద్దరు కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోయారు.
వీరికి సైతం ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని.. తమిళనాడులో 42 ఏళ్ల వ్యక్తి కరోనాతో ప్రాణాలు కోల్పోయినట్లు అధికార వర్గాలు తెలిపాయి. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిత్వశాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గత 48 గంటల్లో 769 కొత్త కేసులు నమోదవగా.. యాక్టివ్ కేసుల సంఖ్య 6వేలు దాటాయి. ఓ వైపు కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సౌకర్యాల స్థాయి సంసిద్ధతను తనిఖీ చేసేందుకు మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నది. ఆక్సిజన్, ఐసోలేషన్ పడకలు, వెంటిలేటర్లు, అవసరమైన మందుల లభ్యతను నిర్ధారించేందుకు అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. భారత్‌లో 6,133 యాక్టివ్ కోవిడ్ కేసులు ఉన్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. చాలా కేసులు తేలికపాటివి లక్షనాలు ఉన్నాయని.. ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉంటే సరిపోతుందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది జనవరి నుంచి దేశంలో 65 మరణాలు సంభవించాయి.