న్యూఢిల్లీ: ఇథియోపియాలోని ఎర్టా అలే రేంజ్లో ఉన్న హైలీ గుబ్బి అగ్నిపర్వతం దాదాపు 10,000 ఏళ్ల తర్వాత ఆదివారం పేలింది. దీని నుంచి పెద్ద ఎత్తున బూడిద, సల్ఫర్‌డయాక్సైడ్, ధూళితో కూడిన పొగ మబ్బులు విస్తృతంగా వ్యాపిస్తున్నాయి. ఈ పొగ మబ్బులు 10-15 కి.మీ. మేరకు ఎగసిపడినట్లు టౌలౌస్ వొల్కానిక్ యాష్ అడ్వయిజరీ సెంటర్ శాటిలైట్ ద్వారా అంచనా వేసింది. ఇవి ఎర్ర సముద్రంపై నుంచి తూర్పు దిశగా వ్యాపిస్తున్నట్లు తెలిపింది.
ఇప్పటికే ఒమన్, యెమెన్‌లపై వీటి ప్రభావం పడింది. ఉత్తర భారతంవైపు వస్తాయని ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ ప్రాంతం గుండా విమాన ప్రయాణాలకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తున్నది. ఢిల్లీ, జైపూర్ మీదుగా ప్రయాణించే విమానాలపై పడే ప్రభావాన్ని భారత విమానయాన శాఖ అంచనా వేస్తున్నది. సోమవారం కొన్ని విమానాల ప్రయాణ మార్గాలను మార్చింది. కన్నూర్ నుంచి అబుదాబి వెళ్లవలసిన ఇండిగో 6ఈ 1433 విమానాన్ని అహ్మదాబాద్‌కు దారి మళ్లించారు.