Puneet Khurana | న్యూఢిల్లీ, జనవరి 1: భార్య వేధింపులు తాళలేక బెంగళూరులో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గత నెల ఆత్మహత్య చేసుకున్న ఘటనను మరువకముందే ఢిల్లీలో ఇదే తరహాలో మరో ఘటన చోటుచేసుకుంది. ఒక బేకరీ యజమాని వ్యాపార భాగస్వామ్యం విషయంలో భార్య నుంచి ఎదురవుతున్న వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య నుంచి విడాకులు పొందేందుకు ప్రయత్నిస్తున్న పునీత్ ఖురానా మంగళవారం కల్యాణ్ విహార్ ప్రాంతంలోని మోడల్ టౌన్లో తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. 2016లో వివాహం చేసుకున్న ఖురానా తన భార్య తీరుతో విసిగిపోయినట్లు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు.
ఫర్ గాడ్స్ కేక్ బేకరీలో ఖురానా దంపతులకు సహ భాగస్వామ్యం ఉంది. వీరికి చెందిన వుడ్బాక్స్ కేఫ్ అనే మరో రెస్టారెంట్ కొన్ని రోజుల క్రితం మూతపడింది. భార్యాభర్తలిద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ మీడియాకు లభించింది. బేకరీ విషయమై వారిద్దరూ గొడవ పడడం అందులో వినిపించింది. బెంగళూరుకు చెందిన టెకీ అతుల్ సుభాష్ భార్య వేధింపులు భరించలేక గత నెల ఆత్మహత్య చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తన భార్య, ఆమె బంధువులు తనను ఎలా వేధింపులకు గురిచేసిందీ సుభాష్ 24 పేజీల సూసైడ్ నోట్లో వివరించారు. ఏళ్ల తరబడి వైవాహిక జీవితంలో ఎదుర్కొన్న వేదనను ఆయన అందులో పేర్కొన్నారు.