మైక్రోసాఫ్ట్ సీఈవో మనోడే. గూగుల్ సీఈవో మనోడే. ట్విట్టర్ సీఈవో కూడా మనోడే. ప్రపంచ దిగ్గజ సంస్థలను మనోళ్లే శాసిస్తున్నారు. దేశం పేరును నిలబెడుతున్నారు.. అని మనకు మనం చెప్పుకొనే ముందు అంతటి ప్రతిభావంతులు మన దేశం విడిచి విదేశాలకు ఎందుకు వెళ్లారు. ఇక్కడి పౌరసత్వం వదులుకొని మరీ అక్కడే ఎందుకు శాశ్వతంగా ఉండిపోతున్నారు. ఇక్కడ ఏం తక్కువైంది అని ఎప్పుడైనా ఆలోచించారా? కేంద్ర హోం శాఖ గతవారం లోక్సభలో వెల్లడించిన వివరాల ప్రకారం 2015 నుంచి 2021 సెప్టెంబర్ వరకు 8,81,254 మంది భారతీయులు తమ భారత పౌరసత్వాన్ని వదులుకొన్నారు.
ఎంతో మేధస్సు ఉన్నా సరైన అవకాశాలు దొరక్కనే భారతీయులు విదేశాలకు వలస పోతున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. విదేశాల్లో పనిగంటలు, జీవన శైలిని భారతీయులు ఇష్టపడుతున్నారని పేర్కొంటున్నారు. భారతీయుల సామర్థ్యం, నైపుణ్యాలు తెలిసిన విదేశీ సంస్థలు ఆకర్షణీయమైన జీతాలతో పాటు సకల వసతులు కల్పిస్తున్నాయి. భారతీయుల కోసం వలస విధానాలనే మార్చుకొంటున్నాయి. మనవాళ్లకు ఇంగ్లిషులో పట్టు ఉండటం కూడా విదేశీయులు మనపై ఆసక్తి చూపడానికి మరో బలమైన కారణం.
విదేశాల్లో ఉద్యోగాల కోసం వెళ్లిన భారతీయుల్లో 59 శాతం మంది శాశ్వతంగా విదేశాల్లోనే ఉండిపోతున్నారని నోట్స్ ఇంటర్నేషన్స్ అనే సోషల్ నెట్వర్కింగ్ సైట్ నిర్వహించిన ఎక్స్పాట్ ఇన్సైడర్-2021 సర్వేలో తేలింది. మిగతా దేశాల వారితో పోలిస్తే భారతీయులు చిన్న వయసులోనే ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్తున్నారని సర్వే పేర్కొన్నది. అయితే, విదేశాలకు ఉద్యోగాల కోసం వచ్చే భారతీయుల్లో స్త్రీల కంటే పురుషుల సంఖ్యే ఎక్కువని, 81 శాతం మంది పురుషులే ఉంటున్నారని వెల్లడించింది.
దేశంలోని మేధస్సు, నైపుణ్యం గల యువత విదేశాలకు తరలిపోయే ట్రెండ్ భవిష్యత్తులో ఇంకా పెరుగుతుందని కేరళలోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైగ్రేషన్ అండ్ డెవలప్మెంట్ చైర్మన్ ఇరుదయ రాజన్ అన్నారు. ‘విదేశాల నుంచి వచ్చే నిపుణులు దేశంలో రిక్రూట్మెంట్లు నిర్వహిస్తారు. నైపుణ్యం ఉన్న వ్యక్తులను ఎంచుకొంటారు. తమ దేశానికి తీసుకుపోతారు. ఆ యువకుల విద్య కోసమేమో మన దేశ ప్రభుత్వం ఐఐటీ, ఐఐఎంలకు కోట్లు ఖర్చు చేస్తుంది. విదేశీ కంపెనీలు వారిని ఎత్తుకెళ్లిపోతాయి’ అని పేర్కొన్నారు.
–నేషనల్ డెస్క్