న్యూఢిల్లీ, ఆగస్టు 14: భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే లక్ష్యంగా ఆర్థిక సంస్కరణల కొత్త శకానికి పునాది పడిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బుధవారం ఆమె జాతినుద్దేశించి ప్రసంగించారు. ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదగడం గర్వించాల్సిన విషయమని, మొదటి మూడు ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఎదిగే క్రమంలో దేశం ఉన్నట్టు పేర్కొన్నారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఏఐ, సెమి కండక్టర్లు, పటిష్టమైన బ్యాంకింగ్, ఆర్థిక రంగాలపై ప్రభుత్వం దృష్టిసారించిందని అన్నారు. సామాజిక న్యాయానికి ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యతను ఇస్తున్నదని, ఎస్సీ, ఎస్టీలు, ఇతర వెనుకబడిన సమాజాల సంక్షేమం కోసం అపారమైన చర్యలు తీసుకుంటున్నదని పేర్కొన్నారు. విభజిత ధోరణులను తిప్పికొట్టాలని ఆమె పిలుపునిచ్చారు. గత దశాబ్ద కాలంగా క్రీడా రంగంలో భారత్ అద్భుతంగా పురోగతి సాధించిందని ఆమె పేర్కొన్నారు. పారిస్ ఒలింపిక్స్‌లో భారతీయ క్రీడాకారుల ప్రదర్శనను, టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా విజయాన్ని ఆమె ప్రస్తావించారు.
రాజధాని ఢిల్లీలో గురువారం జరిగే 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఎర్రకోట సిద్ధమైంది. ఇటీవల పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత బృందం ఈ వేడుకల్లో పాల్గొంటున్నది. వీరే కాక అటల్ ఇన్నోవేషన్ మిషన్ (ఏఐఎం) విద్యార్థులు, బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్‌కు చెందిన కార్మికులు సహా మొత్తం 6,000 మంది ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేస్తున్నారు. వికసిత్ భారత్ @2047 పేరిట నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో యువత, గిరిజనులు, మహిళలు, రైతులు ఇలా అన్ని వర్గాలకు చెందిన వారిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. వీరేకాక మేరా యువభారత్ , ఎన్ఎస్ఎస్ పథకం కింద చేపట్టిన మేరీ మాతీ, మేరీ దేశీ వాలంటీర్లు, అంగన్వాడీ కార్యకర్తలు కూడా పాల్గొంటారు.