ముంబై, జనవరి 28: దానం చేయటానికి అమ్మాయి ఆస్తి కాదని బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఓ తండ్రి తన కూతురును ఓ బాబాకు దానం చేసిన కేసులో పై విధంగా స్పందించింది. మహారాష్ట్రలోని జల్నా జిల్లా బద్నాపూర్లో సంకేశ్వర్ ధక్నే, అతడి అనుచరుడు సోపాన్ ధన్కేతోపాటు ఓ తండ్రి, కూతురు(17) ఉంటున్నారు. సంకేశ్వర్, సోపాన్ తనపై లైంగిక దాడి చేశారని బాలిక 2021 ఆగస్టులో కేసు పెట్టింది. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే, బెయిల్ కోసం దరఖాస్తు చేసుకొని.. తమకు ఆ అమ్మాయిని తండ్రే దానం చేశాడని, 2018లో ఆ బాలికను దానం చేస్తున్నట్టు దానపత్రం పేరుతో రూ.100 బాండ్ పేపర్‌పై తండ్రి సంతకం చేశాడని కోర్టుకు తెలిపారు. దీనిపై బాంబే హైకోర్టుకు చెందిన ఔరంగాబాద్ బెంచ్ విచారణ చేపట్టింది. నిందితులకు రూ.25 వేల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసి, తదుపరి విచారణకు ఫిబ్రవరి 4కు వాయిదా వేసింది.