న్యూఢిల్లీ, డిసెంబర్ 5: భారత్‌కు జీ20 అధ్యక్ష పదవి దక్కటం రొటేషన్‌లో భాగమేనని, దాన్ని మోదీ సర్కారు తాను సాధించిన విజయంగా చెప్పుకోవటం సరికాదని విపక్షాలు తెలిపాయి. సోమవారం జరిగిన అఖిల పక్ష సమావేశంలో ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు సహా పలు పార్టీల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి మాట్లాడుతూ.. ‘జీ20 అధ్యక్ష పదవి చేపట్టే అవకాశం ప్రతి దేశానికి రొటేషన్ పద్ధతిలో వస్తుంది. ఇది పద్ధతి. కానీ, ప్రభుత్వం తానేదో సాధించినట్టు ప్రచారం చేసుకోవటం సరికాదు’ అని అధికార పార్టీకి చురకలు అంటించారు.
ఇదేం ఒక పార్టీ అజెండా కాదని, దేశం మొత్తానికి సంబంధించినదని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ బీజేపీకి సెటైర్ వేశారు. దేశ యువత సాధించిన విజయాలు, రైతులు సాధించిన లక్ష్యాలను ప్రపంచానికి చూపించాలని పలువురు నేతలు ప్రధాని మోదీకి సూచించారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ.. జీ20 అధ్యక్ష పదవి దక్కటం గొప్ప గౌరవమని అన్నారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ 9, 10 తేదీల్లో జరిగే ఈ సమావేశాలను విజయవంతంగా నిర్వహిద్దామని పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి రాష్ర్టాల ముఖ్యమంత్రులు, పలు పార్టీల అధినేతలు హాజరయ్యారు.