న్యూఢిల్లీ, నవంబర్ 12: భారత న్యాయవ్యవస్థ ఇప్పటికీ భూస్వామ్య, సనాతన ఆలోచనా ధోరణితోనే పనిచేస్తున్నదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తు జస్టిస్ డీవై చంద్రచూడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మన న్యాయవ్యవస్థలో ఇప్పటికీ మహిళలకు సముచిత స్థానమే లేదని పేర్కొన్నారు. న్యాయవ్యవస్థ వల్ల ప్రజలకు న్యాయంతోపాటు అన్యాయం కూడా జరుగుతున్నదని వ్యాఖ్యానించారు. శనివారం హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్లో ఆయన మాట్లాడారు. ‘మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. మన న్యాయవ్యవస్థ ఉగ్గు గిన్నెలాంటిది. ఈ వ్యవస్థలో ఇప్పటికే ఉన్నవాళ్ల సంబంధీకులే మళ్లీ అందులోకి వస్తున్నారు. తమ పిల్లలకు ఉగ్గు గిన్నెలో తినిపించినట్టు ముందు తరం వాళ్లు.. వాళ్ల పిల్లలను తీసుకొస్తున్నారు. న్యాయ వృత్తి నిర్మాణం మనదేశంలో ఇప్పటికీ భూస్వామ్య వ్యవస్థలాగా, సనాతన వ్యవస్థలాగా ఉన్నది. ఇందులో మహిళలకు అవకాశమే ఇవ్వటంలేదు’ అని పేర్కొన్నారు.
కిందివర్గాలకు దారివ్వాలి
న్యాయవ్యవస్థలోకి మహిళలు, కిందివర్గాల వారు అధికంగా ప్రవేశించేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉన్నదని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. ‘న్యాయవ్యవస్థలో మహిళలకు ప్రాధాన్యం గురించి మాట్లాడేముందు భవిష్యత్తు తరంలో లింగ సమానత్వం సాధించేలా మనం ఇప్పటినుంచే పునాది నిర్మించాలి. ముఖ్యంగా సీనియర్ లాయర్లు ఉండే వృద్ధ యువకుల క్లబ్బుల వంటి చాంబర్లలోకి మహిళల ప్రవేశాన్ని సులభతరం చేయాలి. న్యాయవ్యవస్థను ప్రజాస్వామ్యీకరణ చేయకుండా, ప్రతిభ ఆధారంగా పనిచేసే వ్యవస్థలా మార్చకుండా అందులోకి మహిళలను, కింది సామాజిక వర్గాలవారిని తీసుకురావటం అసాధ్యం’ అని స్పష్టంచేశారు. సుప్రీంకోర్టులో కేసుల విచారణ ప్రత్యక్ష ప్రసారం చేయటం కొత్త ప్రయోగమని.. హైకోర్టులు, జిల్లాస్థాయి కోర్టుల్లో కూడా ఈ విధానాన్ని ప్రవేశపెడతామని సీజేఐ తెలిపారు.
అణచివేతకు చట్టం సాధనం కాకూడదు
అమెరికా సుప్రీంకోర్టులో ఏటా 180 కేసులు విచారిస్తే, బ్రిటన్ సుప్రీంకోర్టులో 85 కేసులు విచారిస్తారని.. మన సుప్రీంకోర్టులో సోమ, శుక్రవారాల్లో ఒక్కరోజే ఒక్కో న్యాయమూర్తి 75 నుంచి 80 కేసులు విచారిస్తారని సీజేఐ తెలిపారు. మంగళ, బుధ, గురువారాల్లో కూడా ఒక్కో న్యాయమూర్తి కనీసం 30 నుంచి 40 కేసులు విచారిస్తున్నారని చెప్పారు. పెండింగ్ కేసులు న్యాయవ్యవస్థకు పెనుభారంగా మారాయని అన్నారు. న్యాయవ్యవస్థ ప్రజలకు న్యాయం అందించటంతోపాటు కొన్నిసార్లు అన్యాయానికి కూడా కారణమవుతున్నదని పేర్కొన్నారు. మరోవైపు, అణచివేతకు చట్టం సాధనం కాకుండా చూడాల్సిన బాధ్యత న్యాయవ్యవస్థతోపాటు శాసనకర్తలపైనా ఉన్నదని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. ప్రజల్లో అంచనాలు ఉండటం మంచిదే అయినా.. వ్యవస్థలుగా కోర్టులకు ఉన్న పరిధి, అధికారాలను అర్థం చేసుకోవాల్సి ఉన్నదన్నారు.