న్యూఢిల్లీ: దేశంలో ఒమిక్రాన్‌తో తొలి మరణం సంభవించిందా? ఈ వేరియంట్ సోకి మహారాష్ట్రకు చెందిన 52 ఏండ్ల వ్యక్తి మంగళవారం చనిపోయాడు. పింప్రీ చించ్వాడ్లోని ఓ దవాఖానలో ఆయనకు గుండెపోటు వచ్చింది. అయితే, దీన్ని ఒమిక్రాన్ మరణంగా లెక్కలోకి తీసుకోలేమని వైద్యులు, అధికారులు చెప్పారు. చనిపోయిన వ్యక్తి 13 ఏండ్లుగా మధుమేహంతో బాధపడుతున్నాడని తెలిపారు. అతని మృతికి ఇతర అనారోగ్య సమస్యలే కారణం అని చెప్పారు.
కొవిషీల్డ్ టీకాను దేశంలో విక్రయించటంపై సంపూర్ణ హక్కులు కల్పించాలంటూ సీరం ఇన్స్టిట్యూట్ కేంద్రానికి దరఖాస్తు చేసుకుంది.
దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ఉచితంగా ఒమిక్రాన్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తామంటూ ఈ-మెయిల్, ఇతర మార్గాల్లో వచ్చే ఆఫర్లను నమ్మొద్దని కేంద్రం హెచ్చరించింది.
దేశంలో ఒమిక్రాన్ కేసుల పెరుగుదల నేపథ్యంలో రాష్ట్రపతి భవన్, అక్కడి మ్యూజియంలోకి ప్రజలకు శనివారం నుంచి అనుమతి లేదు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ నిషేధం కొనసాగుతుందని ఆ వర్గాలు వెల్లడించాయి.
కొవిడ్ కట్టడి పేరుతో వివిధ రాష్ర్టాలు విధిస్తున్న నైట్ కర్ఫ్యూల వెనుక ఎలాంటి శాస్త్రీయత లేదని డబ్ల్యూహెచ్‌వో చీఫ్ సైంటిస్టు సౌమ్యా స్వామినాథన్ అభిప్రాయపడ్డారు. భారత్‌లాంటి దేశాలు సైన్స్ ఆధారిత విధానాలు అమలు చేయాల్సిన అవసరముందన్నారు. ఒమిక్రాన్ వ్యాప్తి వేగంగా ఉంటుందని, చాలామంది అనారోగ్యం బారిన పడతారన్నారు. టెలీ హెల్త్, టెలీ మెడిసిన్ సర్వీసులు పెంచేందుకు ఇదే సరైన సమయమని అభిప్రాయపడ్డారు.
కరోనా కట్టడికి దాదాపు రెండేండ్ల కిందట విధించిన రాత్రి కర్ఫ్యూను దక్షిణాఫ్రికా ఎత్తేసింది. దేశంలో నాలుగో వేవ్ పీక్స్టేజీ దాటిపోయిందని అధికారులు చెబుతున్నారు.
కరోనా ముప్పు అధికంగా ఉన్నవారికి నాలుగో డోసు ఇవ్వడాన్ని ఇజ్రాయెల్ ప్రారంభించింది.