జైపూర్, అక్టోబర్ 26: అసెంబ్లీ ఎన్నికల ముంగిట రాజస్థాన్‌లో ఈడీ దాడుల కలకలం రేగింది. విదేశీ మారక ద్రవ్య చట్టాన్ని ఉల్లంఘించారన్న ఆరోపణలకు సంబంధించి ఈ నెల 27న తమ ఎదుట విచారణకు హాజరుకావాలని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కుమారుడు వైభవ్‌కు ఈడీ సమన్లు జారీచేసింది. మరోవైపు పరీక్ష పత్రాల లీకేజీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోస్తారా, మహువా అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ఓంప్రకాశ్ హుడ్లా ఇండ్లపై ఈడీ దాడులు చేసింది.
ఈడీ దాడులపై సీఎంగెహ్లాట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ దేశంలో బీభత్సం సృష్టిస్తున్నదని మండిపడ్డారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుంటే.. ఆ రాష్ట్రంలో ఈడీ దాడులు జరుగుతాయని ఆరోపించారు. రాజస్థాన్‌లో ఓటమి ఖాయమని తెలిసిన బీజేపీ చివరి ప్రయత్నంగా ఈడీ దాడులకు తెగబడిందని కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు.
కోల్‌కతా: బెంగాల్ అటవీ శాఖ మంత్రి, తృణమూల్ నాయకుడు జ్యోతిప్రియో మల్లిక్ నివాసం, కార్యాలయాల్లో గురువారం ఈడీ సోదాలు నిర్వహించింది. రేషన్ సరఫరాలో అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణల కేసులో ఈ తనిఖీలు చేపట్టినట్టు అధికారులు తెలిపారు. దీనిపై తృణమూల్ మండిపడింది. ఇదంతా రాజకీయ కక్షసాధింపేనని ఆరోపించింది.