న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: షెంజెన్ వీసాతో యూరప్ దేశాలలో పర్యటించే భారతీయులకు యూరోపియన్ కమిషన్ శుభవార్త చెప్పింది. వీసా కోడ్లో ప్రస్తుత నిబంధనల్ని మార్చుతూ, 5 ఏండ్లపాటు చెల్లుబాటు అయ్యే మల్టీపుల్ ఎంట్రీ షెంజెన్ వీసాను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనిపై భారత్లో ఈయూ రాయబారి హెర్వ్ డెల్ఫిన్ స్పందిస్తూ, ఇరు వైపులా ఉన్న ప్రజల సంబంధాల్ని పెంపొందించే దిశగా మరో అడుగు పడిందని అన్నారు.
‘భారతీయులకు మల్టీపుల్ ఎంట్రీ వీసాలను జారీచేయటంపై కొన్ని ప్రత్యేక నిబంధనలకు ఏప్రిల్ 18న యూరోపియన్ కమిషన్ ఆమోదముద్ర వేసింది. ప్రస్తుతమున్న వీసా కోడ్ ప్రామాణిక నిబంధనల కంటే ఇది చాలా అనుకూలమైంది’ అని ఈయూ ఒక ప్రకటన విడుదల చేసింది.