Election Commission | అసోం రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ఆదేశించింది. తుది ఓటర్ల జాబితాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 10న ప్రచురిస్తామని వెల్లడించింది. ఈ ప్రత్యేక సవరణ జనవరి ఒకటి వరకు చేపట్టాలని అసోం ప్రధాన ఎన్నికల అధికారులకు ఈసీ సూచించింది. అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ రాష్ట్రంలో ప్రత్యేక సవరణ నిర్వహించాలన్న ఈసీ నిర్ణయాన్ని స్వాగతించారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని చెప్పారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు. జనవరి ఒకటి వరకు ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ నిర్వహించాలన్న ఈసీ నిర్ణయాన్ని అసోం ప్రభుత్వం స్వాగతిస్తోందన్నారు.
ఇది అర్హత ఉన్న పౌరులందరికీ స్పష్టమైన, అప్డేట్ చేసిన ఖచ్చితమైన ఓటరు జాబితాను సిద్ధం చేయడంలో సహాయపడుతుందన్నారు. ఈ సవరణ పారదర్శకంగా, సకాలంలో పూర్తయ్యేలా ఎన్నికల సంఘానికి ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు. వచ్చే ఏడాది అసోం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇదిలా ఉండగా.. అక్టోబర్లో కేంద్ర ఎన్నికల సంఘం 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో రెండోదశ ‘సర్’ కోసం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత, తుది ఓటర్ల జాబితా ఫిబ్రవరి 7న ప్రచురించనున్నారు. అండమాన్-నికోబార్ దీవులు, ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్, కేరళ, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, పుదుచ్చేరి, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో కేంద్ర ఎన్నికల సంఘం ‘సర్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నది.