Economic Survey | న్యూఢిల్లీ, జనవరి 31: ఉద్యోగుల్లో పెరుగుతున్న మానసిక ఆరోగ్య సమస్యలపై ఆర్థిక సర్వే ప్రత్యేకంగా స్పందించింది. ఈ అంశం కేవలం వ్యక్తిగత సమస్యే కాదన్న సర్వే.. దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కోబోయే సమస్యగా దాన్ని అభివర్ణించడం గమనార్హం. పని సంస్కృతి, పని గంటలు, జీవనశైలి వంటివి ఉద్యోగుల మానసిక ఆరోగ్యంపై ప్రధానంగా ప్రభావం చూపుతున్నట్టు పేర్కొన్నది. దీన్ని అశ్రద్ధ చేసినైట్టెతే శ్రామిక శక్తినేగాక, దేశ ఆర్థిక వ్యవస్థనూ దెబ్బతీయగలదన్న ఆందోళనను వ్యక్తం చేసింది. ఇటీవలికాలంలో కొందరు బడా కార్పొరేట్లు వారానికి 70 గంటలు పనిచేయాలని, విరామం-సెలవులు లేకుండా శ్రమించాలని చెప్తున్న నేపథ్యంలో ఆర్థిక సర్వే ఆందోళనలు మిక్కిలి ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నాయి.
ఇప్పటికే ఈ అంశంపై సామాజిక మాధ్యమాల్లో చర్చోపచర్చలు జరుగుతున్న విషయమూ తెలిసిందే. ఇదిలావుంటే కుటుంబ సంబంధాలు, ఆహార అలవాట్లు, సంస్థలో ఒత్తిళ్లు, రోజువారీ పని గంటలు, పని వేళలు అన్నీ ఉద్యోగి మానసిక ఆరోగ్యాన్ని అధికంగా ప్రభావితం చేస్తున్నట్టు సర్వే చెప్పింది. ఉద్యోగులు సరిగా పనిచేయకపోతే ఆ సంస్థ ఉత్పత్తి దెబ్బతింటుందని, అంతిమంగా దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తుందన్నది. కాబట్టి ఉద్యోగుల శారీరక, మానసిక ఆరోగ్యాలు రెండూ ముఖ్యమేనన్నది.