న్యూఢిల్లీ: మీ పేరుతో ఉన్న సిమ్ కార్డు మిమ్మల్ని కోర్టులో నిలబెట్టొచ్చని టెలికం విభాగం సోమవారం హెచ్చరించింది. చాలామంది సరదా కోసమో లేక తాము అనుకున్న నంబర్ కోసమో ఎడాపెడా సిమ్ కార్డులు కొనేస్తుంటారు. కొంతమంది అప్పుల వారి బారి నుంచి తప్పించుకొనేందుకు మాటిమాటికీ సిమ్ కార్డులు మారుస్తుంటారు. ఇలా నంబర్ మార్చుకున్న తరువాత పాత సిమ్‌కార్డుల గురించి పట్టించుకోరు. అవి ఎవరైనా నేరగాడి చేతిలో పడితే అవి దుర్వినియోగమయ్యే అవకాశం ఉందని, వారి నేరానికి మీరు శిక్ష అనుభవించవలసి రావచ్చని టెలికం విభాగం సూచించింది.
మీ పేరుతో ఉన్న సిమ్ కార్డుతో సైబర్ నేరం జరిగినా లేక ఏదైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు వాడినా మీరే జవాబుదారీ అవుతారని తెలిపింది. కొన్నిసార్లు చౌకగా లభిస్తున్నాయని ట్యాంపర్ చేసిన ఐఎంఈఐ మొబైల్ ఫోన్లను కొంటారని, వాటి విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. మోడెం, మాడ్యూల్, సిమ్ బాక్సుల వంటి పరికరాలు సేకరించినవైనా, అసెంబుల్ చేసినవైనా కొనుగోలు చేయవద్దని తెలిపింది. తప్పుడు పత్రాలతో లేక ఇతరుల పేర్ల మీద లేక ఇతరుల గుర్తింపు పత్రాలపై సిమ్ కార్డులు కొనుగోలు చేయవద్దని హెచ్చరించింది. మీరు కొన్న సిమ్ కార్డులను ఇతరులకు బదిలీ కూడా చేయవద్దని తెలిపింది.
సైబర్ నేరాలు, ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలకు మీ సిమ్‌కార్డు వినియోగించినట్టు తెలితే మీపై తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. కాలింగ్ లైన్ ఐడెంటిటీ లేదా ఇతర టెలికం గుర్తింపులను మార్చగలిగే యాప్‌లు, వెబ్సైట్లను ఉపయోగించవద్దని కూడా సూచించింది. టెలికమ్యూనికేషన్స్ చట్టం, ప్రకారం మొబైల్ ఫోన్లు లేక ఇతర పరికరాల్లో ఐఎంఈఐ నంబర్‌ను ట్యాంపర్ చేస్తే మూడేండ్ల వరకు జైలు, రూ.50 లక్షల వరకు జరిమానా విధించవచ్చని తెలిపింది. సంచార్ సాథి, లేదా సంచార్ సాథి మొబైల్ యాప్‌లో మీ ఐఎంఈఐ వివరాలను తనిఖీ చేసుకోవాలని సూచించింది.
టెలిఫోన్ నంబర్లను బ్లాక్ చేసినంత మాత్రాన స్పామ్ (అవాంఛిత) కాల్స్ ఆగిపోవని, దీనికి బదులుగా ఈ స్పామ్ కాల్స్‌పై డీఎన్డీ యాప్‌కు ఫిర్యాదు చేయాలని ట్రాయ్ సూచించింది.