న్యూఢిల్లీ: శుభాన్షు ప్రయాణిస్తున్న క్యాప్సుల్ భూ దిగువ కక్ష్యలో 200 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నది. సెకనుకు 7.5 కి.మీ. వేగంతో తాము ప్రయాణిస్తున్నట్టు ఆయన చెప్పారు. భూ ఉపరితలానికి 400 కి.మీ. ఎత్తులో ఐఎస్ఎస్ ఉంటుంది. అంటే క్యాప్సుల్ ఉన్న ప్రాంతం నుంచి ఐఎస్ఎస్ 200 కి.మీ.దూరంలో ఉన్నట్టు లెక్క. దీని ప్రకారం సెకనుకు 7.5 కి.మీ. వేగంతో ప్రయాణిస్తున్న క్యాప్సుల్ కేవలం 27 సెకన్లలోనే ఐఎస్ఎస్కు చేరుకోవాలి. మొత్తంగా ఐఎస్ఎస్ను చేరుకోవడానికి భూమి నుంచి 28 గంటల సమయం పట్టొచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దీనికి కారణం ఆర్బిటాల్ మ్యాన్యువర్లేనని (కక్ష్యపెంపు విన్యాసాలు) వాళ్లు పేర్కొంటున్నారు.
ఐఎస్ఎస్కు చేరుకోవాలంటే క్యాప్సుల్ డైరెక్టుగా ఓ సరళరేఖ మార్గంలో వెళ్లినట్టు ప్రయాణించలేదు. దీనికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి.. ప్రతీ 90 నిమిషాలకు ఒకసారి భూమిని చుట్టివచ్చే ఐఎస్ఎస్ వేగం కాగా.. రెండోది.. నిర్ణీత ప్రాంతంలో ఐఎస్ఎస్తో అనుసంధానం కావాలంటే వేలాది పరిభ్రమణలను పూర్తిచేస్తూ.. ఒక్కో కక్ష్యను పెంచుకొంటూ క్యాప్సుల్ గంటకు 28 వేల కి.మీ. వేగంతో భూస్థిర కక్ష్యలో ప్రయాణించాల్సి రావడమే. ఈ కారణంగానే భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో ఐఎస్ఎస్ ఉన్నప్పటికీ.. దాన్ని చేరుకోవడానికి క్యాప్సుల్కు 28 గంటల సమయం అవసరమవుతున్నది.