నాగ్‌పూర్: మొఘలు చక్రవర్తి ఔరంగజేబ్ సమాధిని తొలగించాలన్న వివాదం మహారాష్ట్రను కుదిపేస్తున్నది. సమాధిని తొలగించాలంటూ సోమవారం నాగ్‌పూర్‌లో కొందరు చేపట్టిన నిరసన హింసాత్మక ఘర్షణలకు దారితీసింది. అల్లరి మూకలు పోలీసులపై రాళ్ల దాడులు చేశారు. వాహనాలను తగలబెట్టారు. ఘర్షణల్లో 25 మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్‌గ్యాస్ ప్రయోగించారు. ఘర్షణల నేపథ్యంలో నగరంలో 144 సెక్షన్ విధించారు.
పోలీసులు గస్తీ బృందాలను పెంచారు. వదంతులను నమ్మవద్దని ప్రజలను అధికారులు కోరారు. పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. హై రిస్క్ జోన్స్‌లో భద్రతా చర్యలను మరింత పటిష్టం చేసినట్లు తెలిపారు. ఘర్షణల నేపథ్యంలో పజలు ప్రశాంతంగా ఉండాలని సీఎం ఫడ్నవీస్, కేంద్ర మంత్రి గడ్కరీ కోరారు. వివాదం నేపథ్యంలో ఔరంగజేబ్ సమాధికి మహారాష్ట్ర ప్రభుత్వం భద్రతను పెంచింది.