ముంబై, జనవరి 1 (నమస్తే తెలంగాణ): రెండు లేదా మూడు వర్షాలకే రోడ్లు పాడయ్యే ఈ కాలంలో పుణెలోని జంగ్లీ మహారాజ్ రోడ్డు ఒక గుంత కూడా లేకుండా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. నమ్మశక్యంగా లేకపోయినా, ఇది వాస్తవం. పుణె నగరంలోని జంగ్లీ మహారాజ్ (జేఎం) రహదారి కథ ప్రత్యేక కారణంతో ప్రసిద్ధి చెందింది. ఈ రోడ్డుపై గత 50 సంవత్సరాలుగా ఒక గుంత పడకపోవడం దీని గొప్పదనం. దీనికి ఒక యువ కార్పొరేటర్ దార్శనికత, రెకొండో కంపెనీ వినూత్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం కారణంగా పేర్కొనవచ్చు.
రూ.15 లక్షలతో నిర్మాణం
1973లో పుణెలో కురిసిన భారీ వర్షాల కారణంగా నగరంలోని రోడ్లు అస్తవ్యస్తంగా మారిపోయాయి. ఆ సమయంలో, వర్షాలను సాకుగా చూపిన అధికారులను యువ కార్పొరేటర్ శ్రీకాంత్ శిరోలే విమర్శించారు. రోడ్ల సమస్యను పరిషరించడానికి ఆయన ముంబైలోని రెకొండో కంపెనీని సంప్రదించారు. ఇద్దరు పార్సీ సోదరులు ఈ కంపెనీ డైరెక్టర్లు. వారు హాట్ మిక్స్ టెక్నాలజీని ఉపయోగించి మన్నికైన రోడ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. జంగ్లీ మహారాజ్ రోడ్డు నిర్మాణం కోసం రూ.15 లక్షలు మంజూరు చేశారు. ఈ రోడ్డుపై 10 ఏండ్లలో గుంతలు పడవని కంపెనీ హామీ ఇచ్చింది. నిర్మాణంలో ఆధునిక సాంకేతికతను ఉపయోగించింది. ఈ రోడ్డు 1976, జనవరి 1న ప్రజల కోసం తెరిచారు. ఆ రోడ్డు ఇప్పటికీ పుణె పట్టణానికి గర్వకారణంగా నిలిచింది..
హాట్ మిక్స్ టెక్నాలజీతో..
ఆశ్చర్యకరంగా, గత 50 ఏండ్లలో జంగ్లీ మహారాజ్ రోడ్డులో ఒక గుంత కూడా పడలేదు. 2013లో రోడ్డు పకన చిన్నచిన్న మరమ్మతులు మాత్రమే అవసరమయ్యాయి, కానీ ప్రధాన రోడ్డు ఇప్పటికీ బలంగా ఉంది. రెకొండో ఉపయోగించిన హాట్ మిక్స్ టెక్నాలజీ, యువ కార్పొరేటర్ శ్రీకాంత్ శిరోలే దార్శనికత పుణెకు 50 సంవత్సరాల తర్వాత కూడా గుంతలు లేని రోడ్డును అందించాయి. నేటి కాంట్రాక్టర్లు, అధికార యంత్రాంగం దీని నుంచి నేర్చుకుని స్థిరమైన రోడ్లను ప్లాన్ చేయాలని ప్రజలు సూచిస్తున్నారు.