బెంగళూరు, సెప్టెంబర్ 26: ఐదు గ్యారెంటీల పేరుతో కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు రాష్ట్ర ప్రజలకు చుక్కలు చూపిస్తున్నది. రోజుకో పన్ను పెంచుతూ ప్రజలను హడలెత్తిస్తున్నది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ఇతరత్రా వాటిపై పన్నులు పెంచేసిన సిద్ధరామయ్య సర్కారు.. ప్రజలకు మరో సినిమా చూపించేందుకు సిద్ధమవుతున్నది. సినిమా టికెట్లు, టెలివిజన్, ఎంటర్టైన్మెంట్ చానళ్ల సబ్‌స్క్రిప్షన్‌పై 2శాతం సెస్విధించాలని కాంగ్రెస్ సర్కారు ప్రతిపాదించింది. సినీ కార్మికుల సంక్షేమ నిధి కోసమంటూ ప్రజలపై మరో ధరల పిడుగు వేసేందుకు సిద్ధమైంది. దీనిపై కాంగ్రెస్ సర్కారు మీద విపక్షాలు ధ్వజమెత్తాయి.
సినీ కార్మికుల సంక్షేమ నిధి కోసం సినిమా టికెట్లు, టెలివిజన్ ఎంటర్టైన్మెంట్ చానెళ్లపై 2 శాతం సెస్సు విధించాలని కార్మిక శాఖ నోటిఫై చేసిన ముసాయిదా నిబంధనలు వెల్లడించాయి. గత ఏడాది ఆమోదించిన కర్ణాటక సినీ, సాంస్కృతిక కార్యకలాపాల(సంక్షేమ) చట్టం పరిధిలోకి ఈ ముసాయిదా నిబంధనలు వస్తాయి. ఈ చట్టం కింద ప్రభుత్వ కర్ణాటక సినీ, సాంస్కృతిక కార్యకర్తల సామాజిక భద్రత, సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తుంది.
నిధుల సమీకరణ కోసం సినిమా టికెట్లు, టీవీ చానెళ్ల సబ్స్క్రిప్షన్ ఫీజుపై 1-2 శాతం సెస్సు విధించవచ్చని చట్టం చెబుతోంది. ముసాయిదా నిబంధనలను అనుసరించి ప్రభుత్వం 2 శాతం సెస్సును ఖరారు చేసింది. మల్టీప్లెక్సులతోసహా అన్ని థియేటర్ల సినిమా టికెట్లపై ఈ సెస్సు వర్తిస్తుందని ముసాయిదా నిబంధనలు తెలిపాయి. కర్ణాటక రాష్ట్రంలో నిర్వహణలో ఉన్న టీవీ వినోద చానెళ్ల మొత్తం లావాదేవీలపై 2 శాతం సెస్సు ఉంటుంది. రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుకు బదులు, కాంగ్రెస్ ‘ధరల పెంపు గ్యారెంటీ’ని అమలు చేస్తున్నదని విపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి.