దియోరియా: ఓ భూ వివాదంలో రెండు వర్గాల మధ్య రేగిన ఘర్షణ ఆరుగురి మృతికి దారితీసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని దియోరియా జిల్లా రుద్రపూర్ ఏరియాలో చోటుచేసుకొన్నది. మృతుల్లో ఐదుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం గమనార్హం. స్పెషల్ డీజీ(లా అండ్ ఆర్డర్) ప్రశాంత్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఫతేపూర్ గ్రామంలోని ఓ భూమిపై రెండు వర్గాలకు చెందిన రెండు కుటుంబాల మధ్య చాలా కాలంగా వివాదం ఉన్నది. జిల్లా మాజీ పంచాయతీ సభ్యుడైన ప్రేమ్ యాదవ్‌ను ఆయన ఇంటిలోనే ప్రత్యర్థి వర్గం సత్యప్రకాశ్ దూబే, ఆయన కుటుంబసభ్యులు పదునైన ఆయుధాలతో దాడి చేసి చంపేశారు.
దీనికి ప్రతీకారంగా అభయ్పూర్కు చెందిన ప్రేమ్ యాదవ్ మద్దతుదారులు దూబే ఇంటిపై దాడి చేశారు. దూబేతో సహా ఐదుగురు కుటుంబసభ్యులను దారుణంగా హత్య చేశారు. వీరిలో దూబే భార్య, 18 ఏండ్ల కంటే తక్కువ వయసున్న వారి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ దాడిలో మరో 8 ఏండ్ల దూబే చిన్న కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం బాలుడికి గోరఖ్‌పూర్‌లోని ఓ దవాఖానలో చికిత్స అందిస్తుండగా, ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నదని వైద్యులు పేర్కొన్నారు. ఈ ఘటనపై విపక్షాలు భగ్గుమన్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని విమర్శించాయి. భూవివాదానికి పరిష్కారం చూపడంలో అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్లే ఈ హత్య ఘటనలు జరిగాయని ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. హత్యలపై ఉన్నత స్థాయి విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.