న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం వంటనూనె ప్యాకెట్ల సైజులో కీలక మార్పులు చేసేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తున్నది. 2023 జనవరి 1 నుంచి ఆయిల్ ప్యాకెట్ల సైజులో సడలింపులు ఇవ్వగా అనేక రకాల సైజుల్లో ప్యాకెట్లు దొరుకుతున్నాయి. ఈ ప్యాకెట్లతో ఇబ్బంది అవుతుందని, పూర్వ సైజుల్లోనే అమ్మాలని వినియోగదారుల శాఖతో ఆయిల్ మార్కెట్ ప్రతినిధులు మంగళవారం సమావేశం అయ్యారు. ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్న 650gm, 700gm, 810gm, 850gm, 870gm ప్యాకెట్ల తయారీని ఆపేయాలని ఇండస్ట్రీ ప్రతినిధులు కోరారు. నిబంధనల ప్రకారం ఉన్న 200ml, 500ml, 1ltr, 2ltr, 3ltr, 4ltr, 5ltr, 15ltr/kg, 20ltr/kg లోనే అమ్మేవిధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఆయిల్ మార్కెట్ ప్రతినిధులు చెబుతున్న దాని ప్రకారం.. మార్కెట్లో ప్రస్తుతం చాలా రకాల సైజుల్లో ప్యాకెట్లు దొరుకుతున్నాయి. దీంతో వినియోగదారులు ఏ ప్యాకెట్ ధర తక్కువగా ఉందో అర్థం చేసుకోలేకపోతున్నాడు. అన్ని ప్యాకెట్లు ఒకే సైజులో కనిపించినా ఆయిల్ పరిమాణం, ధరలో మార్పు గుర్తించలేకపోతున్నాడని ప్రతినిధులు చెబుతున్నారు. ఈ మేరకు సోయాబిన్ ప్రాసెసర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఈ అంశంపై ఈ నెల మొదట్లోనే కేంద్రానికి లేఖ రాసింది. సోపా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డీఎన్ పతాక్ మాట్లాడుతూ మిల్లీలీటర్లు, గ్రాముల్లో తేడాను, ధరలను వినియోగదారుడు గుర్తించలేడని ఆయన తెలిపారు.