న్యూఢిల్లీ, మే 6: రోడ్డు ప్రమాద బాధితులకు లక్షన్నర రూపాయల వరకు ఉచిత వైద్య చికిత్సను అందించే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం సోమవారం నుంచి అమలులోకి వచ్చినట్టు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ ఒక నోటిఫికేషన్ ద్వారా వెల్లడించింది. ‘క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ స్కీం,2025’ అని ఈ పథకానికి పేరు పెట్టారు. ప్రమాదం జరిగిన మొదటి ఏడు రోజుల్లో సమీపంలోని ఏదైనా దవాఖానలో ఉచిత వైద్య సేవలు పొందవచ్చునని కేంద్రం తెలిపింది. రోడ్డు ప్రమాద బాధితులకు గోల్డెన్ అవర్లోఉచిత వైద్యం అందించాలని సుప్రీంకోర్టు గత జనవరిలో ఇచ్చిన తీర్పు నేపథ్యంలో కేంద్రం ఈ నోటిఫికేషన్ జారీ చేసింది.
రోడ్డు ప్రమాదాల్లో సరైన సమయంలో వైద్యం అందక జరిగే మరణాల సంఖ్యను తగ్గించేందుకే ఈ పథకాన్ని అమలులోకి తెచ్చినట్టు కేంద్రం తెలిపింది. ఎటువంటి మోటారు వాహనంపై ప్రయాణిస్తున్న వారైనా, ఏ రోడ్డు మీద ప్రమాదానికి గురైనా ఈ పథకం కింద దవాఖానల్లో రూ.1.5 లక్షల వరకు నగదు రహిత వైద్య సేవలు పొందవచ్చని ఆ నోటిఫికేషన్లో వివరించింది. పోలీసులు, దవాఖానలు, రాష్ర్టాల ఆరోగ్య సంస్థల సహకారంతో జాతీయ ఆరోగ్య సంస్థ (ఎన్హెచ్ఏ) ఈ పథకాన్ని అమలు చేస్తుందని తెలిపింది.
ఇందుకోసం రోడ్డు రవాణాశాఖ కార్యదర్శి నేతృత్వంలో 11 మందితో కూడిన ఒక స్టీరింగ్ కమిటీని ఏర్పాటుచేసింది. రాష్ర్టాలలో రోడ్డు భద్రతా మండలి ఈ పథకం అమలుకు నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుందని పేర్కొంది. రోడ్డు ప్రమాద బాధితులను దవాఖానకు తెచ్చిన వెంటనే వైద్య సేవలు ప్రారంభించాలని, ఒకవేళ తమ వద్ద సౌకర్యాలు లేకపోతే వెంటనే మరో దవాఖానకు పంపాలని తెలిపింది. బాధితుడు డిశ్చార్చి అయ్యాక దవాఖాన అతడి బిల్లును ప్యాకేజీకి అనుగుణంగా పోర్టల్‌లో అప్లోడ్ చేయాలి.