Commodities | న్యూఢిల్లీ: నిత్యావసరాల ధరల నియంత్రణకు ఎట్టకేలకు కేంద్రం చర్యలు ప్రారంభించింది. పప్పు ధాన్యాల నిల్వలపై ఆంక్షలు విధించింది. తాజా నిబంధనల ప్రకారం టోకు వ్యాపారులు 200 టన్నులు, రిటైలర్లు 5 టన్నులు, ఇక బిగ్ చైన్ రిటైలర్లు ఒక్కో ఔట్లెట్లో 5 టన్నులు, డిపోలో 200 టన్నులు, మిల్లైర్లెతే మొత్తం వార్షిక సామర్ధ్యంలో 25 శాతం లేదా గత మూడు నెలల ఉత్పత్తి మొత్తం ఏది ఎక్కువైతే దానిని ఉంచుకోవచ్చు. ఇక దిగుమతిదారులైతే దిగుమతి చేసుకున్న సరుకును కస్టమ్స్ క్లియరెన్స్ జరిగిన తర్వాత 45 రోజులకు మించి ఉంచరాదు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు వీటిని పర్యవేక్షిస్తుంది.
ఉల్లి ధరల స్థిరీకరణ కోసం ఈ ఏడాది 5 లక్షల టన్నులను బఫర్ స్టాక్‌గా ఉంచాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా 71 వేల టన్నుల ఉల్లిని కొనుగోలు చేసింది. దేశంలో చాలా చోట్ల రుతు పవనాల పురోగతి కారణంగా ఉల్లి ధరలు తగ్గుతాయని ప్రభుత్వం అంచనా వేస్తున్నది. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో శుక్రవారం ఉల్లిగడ్డ కిలో ధర 38.67 ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఉల్లి పంట దిగుబడి రబీ సీజన్లో 20 శాతం తగ్గవచ్చునని అంచనా వేస్తున్నారు. గత ఏడాది 302.08 లక్షల టన్నులతో పోలిస్తే ఈ ఏడాది 254.73 లక్షల టన్నులు మాత్రమే ఉల్లిగడ్డ పండుతుందని కేంద్రం అంచనా వేసింది. దీంతో ధరలు పెరగకుండా పెద్దయెత్తున ఉల్లిగడ్డల బఫర్‌స్టాక్‌ను ఉంచుతున్నట్టు ఒక ఉన్నతాధికారి తెలిపారు.