న్యూఢిల్లీ, ఆగస్టు 9: పెగాసస్ దుమారంపై కేంద్రం ఎట్టకేలకు నోరువిప్పింది. స్పైవేర్ కొనుగోలుపై రాజ్యసభ వేదికగా కీలక ప్రకటన చేసింది. ఎన్ఎస్వో గ్రూప్‌తో తాము ఎలాంటి లావాదేవీలు జరుపలేదని, ఒప్పందం చేసుకోలేదని రక్షణశాఖ స్పష్టతనిచ్చింది. ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్ఎస్వో సంస్థనే ఈ పెగాసస్ స్పైవేర్‌ను అమ్ముతుంది. ‘ప్రభుత్వం ఎన్‌ఎస్‌వోతో ఏమైనా లావాదేవీలు జరిపిందా?’ అంటూ రాజ్యసభలో సీపీఎం ఎంపీ శివదాసన్ అడిగిన ఓ ప్రశ్నకు సోమవారం రక్షణశాఖ సహాయ మంత్రి అజయ్ భట్ సమాధానం ఇచ్చారు. ‘కేంద్రరక్షణ మంత్రిత్వశాఖ ఎన్ఎస్వో గ్రూప్‌తో ఎలాంటి లావాదేవీలు జరుపలేదు’ అని చెప్పారు. అయితే, మంత్రి కేవలం రక్షణశాఖ పేరును మాత్రమే ప్రస్తావించడం గమనార్హం. పెగాసస్ గూఢచర్యంపై చర్చకు ప్రతిపక్షాలు పార్లమెంటు సమావేశాలను స్తంభింపజేస్తున్న సమయంలో కేంద్రం ఈ సమాధానం ఇవ్వడం విశేషం. భారత ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీయడానికే ప్రభుత్వంపై గూఢచర్యం ఆరోపణలు చేస్తున్నారని కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ గతంలోనే ఆరోపించారు.