న్యూఢిల్లీ, జూన్ 13: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ – యూజీ పరీక్షపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది. పరీక్షా సమయం కోల్పోయారనే కారణంతో 1,563 మంది విద్యార్థులకు కలిపిన గ్రేస్ మార్కులను ఉపసంహరించుకుంటున్నట్టు పేర్కొన్నది. వీరికి జూన్ 23న మళ్లీ పరీక్ష నిర్వహించి, జూన్ 30న ఫలితాలు విడుదల చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) వెల్లడించాయి.
మే 5న జరిగిన నీట్ – యూజీ పరీక్షలో గతంలో ఎన్నడూ లేని విధంగా 67 మంది 100 శాతం మార్కులతో టాపర్లుగా నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో పరీక్ష ప్రశ్నాపత్రం లీకయ్యిందని, పరీక్షలో అక్రమాలు జరిగాయని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. పలువురు విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే, పరీక్షా సమయం కోల్పోయిన విద్యార్థులకు గ్రేస్ మార్కులు కలపడం వల్లనే ఎక్కువ మంది విద్యార్థులకు 100 శాతం మార్కులు వచ్చాయని ఇప్పటికే ఎన్టీఏ స్పష్టత ఇచ్చింది. ఈ అంశాన్ని గురువారం జస్టిస్ విక్రమ్‌నాథ్, సందీప్ మెహతాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది.
నీట్ – యూజీ పరీక్షకు సంబంధించి నియమించిన కమిటీ సిఫార్సు మేరకు 1,563 మంది విద్యార్థులకు ఇచ్చిన గ్రేస్ మార్కులు ఉపసంహరించుకోవడంతో పాటు వారి స్కోర్ కార్డులను రద్దు చేస్తున్నట్టు కేంద్రం, ఎన్టీఏ తరపున న్యాయవాది కను అగర్వాల్ కోర్టుకు తెలిపారు. గ్రేస్ మార్కులు లేకుండా వీరికి వచ్చిన అసలైన మార్కులను తెలియజేస్తామని చెప్పారు. వీరి కోసం జూన్ 23న మళ్లీ పరీక్ష నిర్వహించి 30న ఫలితాలు ఇస్తామని తెలిపారు. ఈ పరీక్షకు హాజరైన విద్యార్థులకు అందులో వచ్చిన మార్కులనే తుది మార్కులుగా పరిగణనలోకి తీసుకుంటామని, మరోసారి పరీక్ష రాయని విద్యార్థులకు గ్రేస్ మార్కులు లేకుండా ఇచ్చే మార్కులను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. జూలై 6న యథావిధిగా అందరికీ కౌన్సెలింగ్ జరుగుతుందన్నారు. కేంద్రం, ఎన్టీఏ నిర్ణయాన్ని ధర్మాసనం సమర్థించింది. అయితే, ఈ 1,563 మందికే కాకుండా పరీక్షా సమయం కోల్పోయినప్పటికీ కోర్టును ఆశ్రయించని అందరికీ మళ్లీ పరీక్ష నిర్వహించాలని ‘ఫిజిక్స్‌వాలా’ నిర్వాహకుడు అలఖ్ పాండే తరపు న్యాయవాది చేసిన విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది.
గ్రేస్ మార్కులు తీసేయడంతో నీట్-యూజీ టాపర్ల సంఖ్య 67 నుంచి 61కి తగ్గింది. మొదట విడుదల చేసిన పలితాల్లో 67 మంది 720కి 720 మార్కులు సాధించి టాపర్లుగా నిలిచారు. గ్రేస్ మార్కులు కలిసిన 1,563 మందిలో టాపర్లు ఆరుగురు ఉన్నారు. కాగా, 1,563 మందిలో ఎంత మంది మళ్లీ పరీక్ష రాసేందుకు అంగీకరిస్తారో తేలిన తర్వాత కొత్త ర్యాంక్ లిస్టును విడుదల చేస్తామని ఎన్టీఏ తెలిపింది.
నీట్ – యూజీ పేపర్ లీక్ అయిందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గురువారం పేర్కొన్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీపైన వచ్చిన అవినీతి ఆరోపణలు నిరాధారమైనవని అన్నారు. ఎన్టీఏ చాలా విశ్వసనీయమైన సంస్థ అని కితాబిచ్చారు. ఉన్నత విద్య స్థాయిలోనే కాకుండా ప్రతియేటా 50 లక్షల మంది స్కూల్ విద్యార్థులకు ఎన్టీఏ పరీక్షలు నిర్వహిస్తున్నదని గుర్తు చేశారు. 1,563 మంది విద్యార్థులకు సుప్రీంకోర్టు ఫార్ములా ఆధారంగానే ఎన్టీఏ ఇచ్చిందని స్పష్టం చేశారు.
నీట్-యూజీ పరీక్షలో అక్రమాల ఆరోపణల నేపథ్యంలో కేంద్రం, ఎన్టీఏ తీరును తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా విమర్శించింది. ఈ అక్రమాలకు, గందరగోళానికి ఎన్టీఏదే పూర్తి బాధ్యత అని తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి మా సుబ్రమణియన్ ఆరోపించారు. అసలు ఏ ప్రాతిపదికన గ్రేస్ మార్కులు వేశారని, ఈ నిర్ణయాన్ని నీట్ అభ్యర్థులకు చెప్పారా? అని ప్రశ్నించారు. నీట్‌ను రద్దు చేయాలని తమ సీఎం ఇన్ని రోజులుగా చేస్తున్న డిమాండ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వినిపిస్తున్నదని, కేంద్రం ఇప్పటికైన నీట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
నీట్ పరీక్షకు సంబంధించి గ్రేస్ మార్కులు మాత్రమే సమస్య కాదని, పరీక్షలో అక్రమాలు జరిగాయని, పేపర్ లీక్ అయ్యిందని, అవినీతి చోటుచేసుకుందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ఈ వ్యవహారాన్ని ఎన్టీఏపై నెట్టేసి మోదీ ప్రభుత్వం తప్పించుకోలేదని, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని ఖర్గే, తృణమూల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి శంతను సేన్ డిమాండ్ చేశారు. కాగా, నీట్లో అక్రమాలకు వ్యతిరేకంగా కోల్‌కతా సహా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో విద్యార్థులు ఆందోళన నిర్వహించారు.
హైదరాబాద్, జూన్13 (నమస్తే తెలంగాణ): నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయని, వాటిపై విచారణ జరిపించాలని, మళ్లీ పరీక్ష నిర్వహించాలని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేశ్ డిమాండ్ చేశారు. గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. నీట్ ద్వారా 15శాతం మెడికల్ సీట్లు జాతీయ కోటాలో చేరుతున్నందున తెలంగాణ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని వాపోయారు.