న్యూఢిల్లీ, జూన్ 27: 1592 మంది అసిస్టెంట్ సెక్షన్ అధికారులకు(ఏఎస్ఓలు) ఒకేసారి సెక్షన్ ఆఫీసర్లుగా కేంద్రం పదోన్నతి కల్పించింది. ఈ నిర్ణయం అడ్హక్ ప్రాతిపదికన వెంటనే అమల్లోకి వస్తుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మంగళవారం వెల్లడించారు. పదోన్నతుల ఆదేశాలు త్వరలోనే సంబంధిత విభాగాల నియంత్రణాధికారులకు పంపిస్తామని ఆయన తెలిపారు.
త్వరలో మరో 2 వేల మందికి ఏఎస్ఓలు, ఇతర గ్రేడ్ అధికారులకు ప్రమోషన్లు ఇస్తామని చెప్పారు. సుదీర్ఘ కాలం ఒకే పోస్టులో పని చేస్తున్న అధికారులకు పదోన్నతులు కల్పించాలని సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రధానికి లేఖ రాసిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.