పదుల మందిని మోసగించిన ఉత్తరాది ‘వధువు’, దక్షిణాది ‘వరుడు’
శ్రీనగర్ : ఆమె పేరు షహీన్ అఖ్తర్.. వయస్సు 30 ఏండ్లు.. ముస్లిం మతంలో పెండ్లి కొడుకు పెండ్లి కూతురికి నిఖా సమయంలో ఇచ్చే ‘మెహ్(్రకానుక ధనం)’ ఆమె లక్ష్యం. ఇంకేముందీ.. పెండ్లి పేరుతో 12 మందిని మోసం చేసి వారి డబ్బు, నగలు కాజేసి కొన్నేండ్ల పాటు తప్పించుకు తిరిగింది. ప్రతి ‘భర’్తతో నాలుగు నెలలు కాపురం చేయడం..చెప్పా పెట్టకుండా ఉడాయించడం ఆమె స్వభావం. గత వారం ఇలాగే రాజౌరీ పట్టణంలో ఒక వ్యక్తిని మోసం చేయడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు తీగ లాగితే డొంకంతా బయటపడింది. ఆమె ముందస్తు బెయిల్ విచారణ సందర్భంగా ఈ నెల 14న బుద్గాం కోర్టుకు వచ్చిన బాధితులు తాము షహీన్ చేతిలో ఎలా మోసపోయామో మీడియాకు వెల్లడించారు.
ఇక బెంగళూరుకు చెందిన మహేష్(35) శైలే వేరు! మధ్య వయస్సు మహిళలే ఆయన టార్గెట్. డాక్టర్, ఇంజినీర్, కాంట్రాక్టర్ అంటూ పరిచయం చేసుకొని సంబంధాలు పెంచుకుంటూ, పెండ్లి దాకా తీసుకెళ్లడం..తర్వాత డబ్బు, నగలతో పరారవ్వడం.. అతడికి బాగా తెలిసిన విద్య. 15 మంది మహిళలను మోసం చేశాడని మైసూర్ పోలీసుల దర్యాప్తులో తేలింది. అతడి నుంచి కార్లు, బంగారు నగలు, రూ.2 లక్షల నగదును ఆదివారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ మ్యాట్రిమోనీ వెబ్సైట్లో మహేష్ ప్రొఫైల్ చూసి మోసపోయిన ఓ బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేయడంతో ఈ నిత్య పెండ్లి కొడుకు మోసాలు వెలుగుచూశాయి.