హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టుల మృతదేహాలు కుళ్లిపోతున్నాయని, భౌతికకాయాలను వెంటనే తమకు అప్పగించాలని కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలంటూ శాంతి సమన్వయ కమిటీ తెలంగాణ, ఏపీ రాష్ర్టాల ప్రభుత్వాలకు లేఖలు రాసింది. మృతదేహాలతో గౌరవప్రదంగా వ్యవహరించాలనే హకును ఉల్లంఘిస్తున్నారని కమిటీ సభ్యులు ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ జీ లక్ష్మణ్, ఎంఎఫ్ గోపీనాథ్, కవితా శ్రీవాత్సవ, క్రాంతి చైతన్య, మీనా కందస్వామి మండిపడ్డారు.
ఛత్తీస్గఢ్ అబూజ్మడ్ ప్రాంతంలో మే 21న మరణించిన మావోయిస్టుల మృతదేహాలకు పోస్ట్మార్టం పూర్తిచేసి, మృతదేహాలను కుటుంబాలకు అప్పగిస్తామని ఛత్తీస్గఢ్ అడ్వకేట్ జనరల్ 2025 మే 24న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముందు హామీ ఇచ్చారని, కానీ ఇప్పటికీ మృతదేహాలను ఇవ్వలేదని తెలిపారు. ఈ సుదీర్ఘ జాప్యం బాధిత కుటుంబాలకు మరింత ఆవేదన కలిగిస్తున్నదని చెప్పారు. మృతదేహాలను గౌరవంగా భద్రపరచాలనే చట్టపరమైన, నైతిక బాధ్యత ఉన్నప్పటికీ వాటిని కుళ్లిపోయేలా వదిలేశారనే ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నట్టు తెలిపారు. మృతదేహాలను తీసుకోవడానికి వెళ్లిన మావోయిస్టుల కుటుంబసభ్యులు, బంధువులతో అమానవీయంగా వ్యవహరించడం అధికారులు మానుకోవాలని హితవు పలికారు.