న్యూఢిల్లీ, ఆగస్టు 23: ‘నాయకత్వం లేని, మీమ్‌ల ఆధారిత యువజన ఉద్యమం తమ మెడలు వంచడాన్ని బీజేపీ ప్రభుత్వం ప్రత్యక్షంగా అనుభవించింది. దీంతో చట్టబద్ధమైన నిరసన పరిధిని కుదించడానికి నిర్ణయించింది. అందుకు అవసరమైన పదజాలాన్ని ముందుగానే సిద్ధం చేసుకుంది. దానికి ఎర్రకోటను వేదికగా మార్చుకుంది.’ అని ప్రముఖ రచయిత, హక్కుల కార్యకర్త ప్రొఫెసర్ ఆనంద్ తేల్తుంబ్డే ‘ద వైర్’ వెబ్సైట్లో మోదీ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఆయన విశ్లేషణ ప్రకారం.. స్వాతంత్య్ర దినోత్సవం నాడు సుపరిచితమైన విజయగర్వంతో మోదీ ఎర్రకోట నుంచి ప్రసంగాన్ని ప్రారంభించారు. 75 నిమిషాల మోదీ ప్రసంగం మొత్తం స్వయం సమృద్ధి, సాంకేతిక శక్తి, తయారీ, శక్తి, భద్రత, రక్షణ, యువత, కొత్త సప్త ధార వ్యూహాల చుట్టూ తిరిగింది.
రాబోయే ఐదేండ్లలో అమెరికా నుంచి ఎనర్జీ, వైమానిక, సాంకేతిక సంబంధ రూ.47.85 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులను దిగుమతి చేసుకునేందుకు ఒక వైపు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒప్పందం చేసుకున్న విషయాన్ని పేర్కొంటూనే ఆత్మనిర్భరత గురించి పేర్కొన్నారు. ముఖ్యంగా యూత్‌లో ఇటీవల పెరిగిన నిరసనను అణచివేసేందుకు ఆయన తన ప్రసంగంలో ‘దిమాగీ నక్సల్స్’ అన్న పద బంధాన్ని ప్రయోగించి విమర్శల పాలయ్యారు. కాక్రోచ్ ఉద్యమం ఎన్నడూ లేని విధంగా మోదీ ప్రభుత్వాన్ని తొలిసారిగా తలవొంచేలా చేసింది.
ఎలక్ట్రానిక్స్ తయారీ ఏడు రెట్లు, రైల్ కోచ్‌ల తయారీ 21 రెట్లు పెరిగినట్టు మోదీ తన ప్రసంగంలో గొప్పలు చెప్పారే తప్ప ఆయన తన ప్రధాన వైఫల్యాలను దాటవేశారు. భారత జీడీపీలో తయారీ రంగం వాటా గత 60 ఏండ్లలో ఎన్నడూ లేనంతగా 13 శాతానికి దిగజారిన ముఖ్య విషయంపై మాత్రం ఆయన నోరెత్తలేదు. మోదీకి ప్రజలు ఐదేండ్ల పాటు పాలించమని తీర్పు చెప్పారే తప్ప 21 ఏండ్లకు కాదు కదా, అలాంటప్పుడు 2047 వరకు తానే అధికారంలో ఉంటానన్న విధంగా 21 ఏండ్ల తర్వాత నాటి లక్ష్యాల గురించి వల్లె వేయడం ఏంది? వర్తమానం నాటి సమస్యలపై సమాధానాలు చెప్పకుండా భవిష్యత్తు ఆశల గురించి ప్రస్తావించడమేందో ఆయనే చెప్పాలి.
పౌరుల సమస్యలు, వారి ఆందోళన గురించి మాట్లాడటానికి బదులుగా ఆయన ఒక శత్రువుతో పోరాడుతున్నట్టు ప్రసంగించారు. తనను ప్రశ్నించే వారందరూ ఆయన దృష్టిలో శత్రువులే. ముఖ్యంగా తమ రాజకీయ గళాన్ని వినిపిస్తున్న జెన్-జడ్, జెన్ ఆల్ఫా తరం వారే తన శత్రువులన్న పరోక్ష సందేశాన్ని ఇచ్చారు. మోదీ చేసిన ‘దిమాగీ నక్సల్స్’ అనే పదం రాజకీయంగా వివాదమైన అర్బన్ నక్సల్ అనే ముద్రను ప్రతిధ్వనిస్తుంది.విద్యావేత్తలు, విమర్శకులపై ఈ ముద్ర వేసి గత కొన్ని ఏండ్లుగా మోదీ, బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే.