(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): బంగారం, వెండి, లిథియం వంటి విలువైన ఖనిజాలను వెలికితీసే అనుమతులను ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కారు పావులు కదుపుతున్నది. ఇందుకోసం గనులు, ఖనిజాలు (అభివృద్ధి) చట్టం-1957కు చేసిన సవరణలను కేంద్ర క్యాబినెట్ తాజాగా ఆమోదించింది. సవరించిన బిల్లును రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో పెట్టనున్నారు. ఒకవేళ ఈ బిల్లుకు ఆమోదం లభిస్తే విలువైన ఖనిజాలను ప్రైవేటు సంస్థలు ప్రాసెస్ చేయడంతో పాటు ఎగుమతికి కూడా మార్గం సుగమం కానున్నది. ఈ సవరణ బిల్లు చట్టంగా మారితే దేశంలోని దాదాపు అన్ని గనుల్లో ప్రైవేటు పెత్తనం పెరగొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
గనుల చట్టంలో కేంద్రం హడావుడిగా సవరణలు చేయడానికి జమ్ముకశ్మీర్లో ఇటీవల బయటపడిన రూ.35 లక్షల కోట్ల విలువైన 59 లక్షల టన్నుల లిథియం నిల్వలే కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నిల్వలను వేలం వేసి కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టాలనే ఉద్దేశంతోనే కేంద్రం హడావిడిగా చట్టానికి సవరణలు చేసింది. లిథియం వెలికితీత, ప్రాసెసింగ్లో దశాబ్దాల అనుభవం ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలైన నేషనల్ అల్యూమినియం కంపెనీ, హిందుస్థాన్ కాపర్, మినరల్ ఎక్స్ప్లోరేషన్ కార్పొరేషన్లను కాదని జాతి సంపదను కార్పొరేట్లకు దోచిపెట్టేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.