Manish Sisodia : బీజేపీ తప్పుడు కేసులు బనాయించి ప్రతిపక్ష పార్టీల నేతలను వేధిస్తున్నదని ఆప్ సీనియర్ నాయకుడు, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా విమర్శించారు. ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్‌ను జైల్లో పెట్టేందుకు బీజేపీ సర్కారు కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేసిందని ఆయన మండిపడ్డారు. కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్ట్ చేసిన తీరును శుక్రవారం సుప్రీంకోర్టే తప్పుపట్టిన విషయాన్ని గుర్తుచేశారు.
కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్ట్ చేసిన తీరు చూస్తుంటే.. ఆయనను మరికొంత కాలం జైల్లో ఉంచాలన్నదే వారి ఉద్ధేశంగా స్పష్టమవుతున్నదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన విషయాన్ని మనీశ్ సిసోడియా ప్రస్తావించారు. ఏ తప్పూ చేయకుండా కేజ్రీవాల్‌ను ఎందుకు అరెస్ట్ చేశారని, ఆయనను అరెస్ట్ చేయాలనే ఆలోచన ఎవరిదని సిసోడియా ప్రశ్నించారు. ఇది కచ్చితంగా బీజేపీ ఆలోచనే అని ఆయన ఆరోపించారు.
ఈడీ కేసులో కేజ్రీవాల్ విడుదలకు లైన్ క్లియర్ కాగానే బీజేపీ సర్కారు సీబీఐ చేత ఆయనను అరెస్ట్ చేయించిందని, దర్యాప్తు పేరుతో మరికొన్ని నెలలపాటు ఆయనను జైల్లో ఉంచాలన్నదే బీజేపీ పాలకుల ఉద్దేశమని మనీశ్ మండిపడ్డారు. కేజ్రీవాల్ ఏ తప్పూ చేయలేదు కాబట్టే అప్పటిదాకా సీబీఐ ఆయన జోలికి వెళ్లలేదని, కానీ చివరికి బీజేపీ కోరిక మేరకు అరెస్ట్ చేసిందని ఆరోపించారు. ఇవాళ సుప్రీంకోర్టు సాక్షిగా బీజేపీ కుయుక్తి బయటపడిందని విమర్శించారు.