న్యూఢిల్లీ: ‘చాట్‌జీపీటీ’తో సంచలనం సృష్టించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ కంపెనీ ‘ఓపెన్ఏఐ’ ఊహించని సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. కంపెనీ సహ వ్యవస్థాపకుల్లో ఒకరు, సీఈవో సామ్ ఆల్ట్మన్పై ‘ఓపెన్ఏఐ’ బోర్డు వేటు వేయటం ఆ కంపెనీ ఉద్యోగుల్ని ఆగ్రహానికి గురిచేసింది. ఆల్ట్‌మన్ తొలగింపుపై నిరసన వ్యక్తం చేస్తూ.. మొత్తం 500మంది ఉద్యోగులు రాజీనామాకు సిద్ధమయ్యారు.
‘ఓపెన్ ఏఐ’ బోర్డు సభ్యులంతా రాజీనామా చేయాలని లేదంటే, తామంతా రాజీనామా చేసి.. ఆల్ట్‌మన్ వెంట వెళ్లిపోతామని హెచ్చరించినట్టు సమాచారం. మరోవైపు, ఆల్ట్‌మన్.. మైక్రోసాఫ్ట్‌లో చేరనున్నట్టు ఆ సంస్థ సీఈవో సత్య నాదెళ్ల ప్రకటించారు.