శ్రీనగర్: వార్షిక అమర్నాథ్ యాత్ర ఈ నెల 29 శనివారం నుంచి ప్రారంభమవుతుంది. 52 రోజులపాటు సాగే ఈ యాత్ర ఆగస్టు 19తో ముగుస్తుంది. జమ్ముకశ్మీరులోని అనంత్‌నాగ్‌లో ఉన్న 48 కిలోమీటర్ల పొడవైన నున్వాన్-పహల్గామ్ మార్గంతోపాటు 14 కిలోమీటర్ల పొడవైన బల్తల్ మార్గంలో కూడా భక్తులు వెళ్తారు.
ఓ అధికారి మాట్లాడుతూ, మొదటి భక్త బృందం శుక్రవారం తెల్లవారుజాము 4 గంటలకు భగవతి నగర్‌లోని జమ్ము బేస్ క్యాంప్ వద్ద కశ్మీరుకు బయల్దేరుతుందని చెప్పారు. భక్తుల కోసం జమ్ములో గురువారం నుంచి స్పాట్ రిజిస్ట్రేషన్ ప్రారంభించినట్టు తెలిపారు. షాలిమార్ ప్రాంతంలో స్పాట్ రిజిస్ట్రేషన్ సెంటర్‌ను తెరిచామన్నారు.
ఎన్నడూ రాజకీయ ఒత్తిళ్లను ఎదుర్కొనలేదు: సీజేఐ
న్యూఢిల్లీ: న్యాయమూర్తిగా 24 ఏళ్ల పదవీ కాలంలో తాను ఎన్నడూ ప్రభుత్వం నుంచి రాజకీయ ఒత్తిళ్లను ఎదుర్కొనలేదని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్ చెప్పారు. ఆక్స్ఫర్డ్ యూనియన్ నిర్వహించిన సెషన్లో అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్తూ, అప్పటికప్పుడు ఉండే భావోద్వేగాలతో సంబంధం లేకుండా, రాజ్యాంగ విధానాల ఆధారంగా స్థిరపడిన సంప్రదాయాల ప్రాతిపదికపై భారతదేశంలోని న్యాయస్థానాలు తీర్పులిస్తాయని, ఇటువంటి విధానంలో వివాదాలను పరిష్కరించడంలో దేశంలోని న్యాయమూర్తులు సుశిక్షితులని చెప్పారు.
ఢిల్లీలోని అసదుద్దీన్ ఇంటిపై దాడి
న్యూఢిల్లీ, జూన్ 27: ఢిల్లీలోని తన నివాసంపై గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడ్డారని ఎఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దిన్ ఓవైసీ ఆరోపించారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’లో గురువారం పోస్ట్ చేశారు. 34 అశోక రోడ్డులోని తన ఇంటి గేటు వద్ద ఉన్న నామఫలకంపై నల్ల ఇంకు రాసినట్టు, ఇజ్రాయెల్‌కు మద్దతుగా పోస్టర్ అంటించినట్టు ఈ వీడియోలో కనిపిస్తున్నది.