(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశంతో హర్యానాలోని అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో అలవిగాని హామీలను కురిపించాయి. బడ్జెట్ పరిమితి కూడా పట్టించుకోకుండా ఇచ్చిన ఈ అనాలోచిత వాగ్దానాలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఛిన్నాభిన్నమయ్యే ప్రమాదం పొంచి ఉన్నదని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బడ్జెట్లో 25 శాతం నుంచి 37 శాతం వరకు నిధులు ఉచిత హామీల అమలుకే కేటాయించడమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఇలా అనాలోచిత హామీలు ఇస్తూపోతుంటే హర్యానా దివాలా తీసే ప్రమాదం రావొచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ హామీల అమలుకు ఏటా అవసరమయ్యే మొత్తం రూ. 70 వేల కోట్లు (బడ్జెట్లో 37 శాతం)
బీజేపీ హామీల అమలుకు ఏటా అవసరమయ్యే మొత్తం రూ. 50 వేల కోట్లు (బడ్జెట్లో 24 శాతం)
కాంగ్రెస్ ప్రధాన హామీలు: మహిళలకు నెలకు రూ.2 వేలు, 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, ఎమ్మెస్పీకి చట్టబద్ధత, వృద్ధులకు, వితంతువులకు నెలకు రూ.6 వేలు, రూ.500కు ఎల్పీజీ, రూ.25 లక్షల విలువైన ఉచిత వైద్యం, 2 లక్షల ఉద్యోగాల భర్తీ.
బీజేపీ ప్రధాన హామీలు: మహిళలకు నెలకు రూ.2,100, 2 లక్షల ఉద్యోగాల భర్తీ, ఎస్సీ, బీసీ విద్యార్థులకు ప్రభుత్వ ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలో ఫుల్ స్కాలర్షిప్, 24 రకాల పంటలకు ఎమ్మెస్పీ, రూ.500కు ఎల్పీజీ, నిరుద్యోగులకు భృతి.