న్యూఢిల్లీ: గత దశాబ్దంలో భారత్లో కోటీశ్వరుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ‘సూపర్ రిచ్’లో 15 శాతానికిపైగా 30 ఏండ్ల లోపువారే ఉన్నారని తాజా నివేదిక వెల్లడించింది. అంతేకాదు వీరి సంఖ్య దశాబ్దం చివరినాటికి 25 శాతానికి చేరుకుంటుందని కూడా అంచనా వేసింది. టెక్నాలజీ, ఐపీవోల జారీ, కొత్తగా స్టార్టప్ కంపెనీలు నెలకొల్పటం అనేక మందిని కోటీశ్వరుల జాబితాలో చేర్చిందని ‘అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్’ నివేదిక పేర్కొన్నది.
2024లో రోల్స్ రాయిస్, పోష్ వంటి అత్యంత ఖరీదైన కార్ల అమ్మకాలు పెరగడానికి కారణం యువ కోటీశ్వరులేనని పేర్కొన్నది. ‘కోటీశ్వరుల జాబితాలో యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, టెక్ మార్గదర్శకులు, అనుభవజ్ఞులైన పారిశ్రామికవేత్తల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది’ అని సంస్థ రిసెర్చ్ హెడ్, ప్రశాంత్ ఠాకూర్ చెప్పారు. వీరి నివేదిక ప్రకారం, భారతీయ మిలియనీర్లలో 40 ఏండ్ల లోపువాళ్లు 20 శాతం మంది ఉన్నారు.