Modi 3.0 Cabinet | కేంద్రంలో ముచ్చటగా కొలువు దీరిన నరేంద్రమోదీ మంత్రి వర్గం పాత, కొత్త నేతల మిశ్రమంగా ఉంది. సొంత బీజేపీ నేతలతోపాటు ఎన్డీఏ మిత్ర పక్షాల నాయకులకు మంత్రి వర్గంలో ప్రధాని మోదీ అవకాశం కల్పించారు. మోదీ 3.0 మంత్రివర్గంలో పది మంది సీనియర్ మంత్రులకు తిరిగి చోటు కల్పించారు. వారిలో అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, జైశంకర్, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, అశ్వినీ వైష్ణవ్, భూపేంద్ర యాదవ్, కిరణ్ రిజిజు ఉన్నారు.
మోదీ 2.0 మంత్రివర్గంలో హోంమంత్రిగా పని చేసిన అమిత్ షా.. గుజరాత్ లోని గాంధీ నగర్ స్థానం నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. గత ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా పని చేసిన రాజ్ నాథ్ సింగ్ తిరిగి కేంద్ర మంత్రిగా పని చేశారు. మోదీ తొలి విడత సర్కారులో హోంమంత్రిగా సేవలందించారు. అంతకుముందు ఉత్తరప్రదేశ్ సీఎంగానూ పని చేశారు.
మోదీ తొలి విడత మంత్రివర్గంలో వాణిజ్య, రక్షణ శాఖలు నిర్వహించిన నిర్మలా సీతారామన్.. 2.0 ప్రభుత్వంలో ఆర్థిక శాఖ నిర్వహించారు. తాజాగా మూడోసారి కేంద్ర మంత్రిగా ప్రమాణం చేశారు. గత ప్రభుత్వంలో విదేశాంగ శాఖ మంత్రిగా పని చేసిన ఎస్ జై శంకర్ ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆదివారం మోదీ 3.0 మంత్రివర్గంలోనూ జై శంకర్ ప్రమాణం చేశారు.
నరేంద్ర మోదీ తొలి విడత ప్రభుత్వంలో పలుశాఖలు నిర్వహించిన పీయూష్ గోయల్.. గత ప్రభుత్వంలో రైల్వే, వాణిజ్య వ్యవహారాల శాఖ మంత్రిగా పని చేశారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఒడిశా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మేంద్ర ప్రధాన్.. మోదీ తొలి విడత మంత్రివర్గంలో పెట్రోలియం శాఖ మంత్రిగా, మలి విడుత ప్రభుత్వంలో స్కిల్ డెవలప్ మెంట్, స్టీల్, విద్యాశాఖలు నిర్వహించారు.
2021లో కేంద్ర మంత్రి వర్గంలోకి వచ్చిన అశ్వినీ వైష్ణవ్.. రైల్వే, టెలీ కమ్యూనికేషన్ల శాఖ మంత్రిగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. అశ్వినీ వైష్ణవ్ తోపాటు 2021లో మోదీ మంత్రివర్గంలో చేరిన మరో నేత భూపేంద్ర యాదవ్. రాజస్థాన్ లోని అల్వార్ నుంచి ఎన్నికైన భూపేంద్ర యాదవ్.. గత మంత్రి వర్గంలో కార్మిక, పర్యావరణ, ఉపాధి కల్పనా శాఖ మంత్రిగా పని చేశారు.
మోదీ తొలి విడుత మంత్రి వర్గంలో కేంద్ర హోంశాఖ, మైనారిటీ వ్యవహారాల సహాయ మంత్రిగా, యువజన సర్వీసుల మంత్రిగా పని చేశారు. మోదీ 2.0 మంత్రివర్గంలో న్యాయశాఖ, భూశాస్త్ర వ్యవహారాల శాఖ నిర్వహించారు. అరుణాచల్ ప్రదేశ్ వెస్ట్ నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు.
ఇక మొత్తం కేంద్ర మంత్రి వర్గంలో బీజేపీ నుంచి 61 మంది, మిత్ర పక్షాలు టీడీపీ, జేడీయూ నుంచి ఇద్దరేసి నేతలు, ఎల్జేపీ, శివసేన, ఆర్పీఐ, జేడీఎస్, ఆర్ఎల్డీ, హెచ్ఏఎం పార్టీ, ఏడీఎస్ల నుంచి ఒక్కొక్కరు చొప్పున కేంద్ర క్యాబినెట్ లో చోటు దక్కింది.