శ్రీనగర్, డిసెంబర్ 31: భారత పౌరులకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు అందరికీ అందడం లేదని జమ్ముకశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ పేర్కొన్నారు. ప్రభుత్వ వైఖరికి అనుగుణంగా మెలిగేవారికి మాత్రమే ఇప్పుడు అవి అర్హమైనవిగా, విలాసవంతమైనవిగా మారాయని ఆరోపించారు. ఈ మేరకు ఆమె సీజేఐ జస్టిస్ చంద్రచూడ్‌కు శనివారం ఓ లేఖ రాశారు.
2019లో 370వ అధికరణను రద్దు చేసిన నాటి నుంచి జమ్ముకశ్మీర్‌లో విశ్వాస లోటు ఏర్పడి పరాధీన భావం పెరిగిందని ఆమె తెలిపారు. ‘ప్రస్తుతం దేశంలో, ప్రత్యేకించి జమ్ముకశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితిపై ఎంతో ఆందోళనతో, ఆవేదనతో మీకు ఈ లేఖ రాస్తున్నా. మన ప్రజాస్వామ్య వ్యవస్థలో దిగువస్థాయి కోర్టులు కనీసం సాధారణ కేసుల్లోనూ బెయిల్ మంజూరు చేయలేకపోతున్నాయని ఇటీవల మీరు వ్యక్తం చేసిన అభిప్రాయాలు వార్తా పత్రికల్లో కేవలం సింగిల్ కాలమ్ కథనానికే పరిమితం కాకుండా ఒక నిర్దేశకంగా స్వీకరించబడాలి’ అని ముఫ్తీ ఆ లేఖలో పేర్కొన్నారు.