(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్, జులై 23(నమస్తే తెలంగాణ): నిజాల కంటే అబద్ధపు ప్రచారాలే ఎన్నికల్లో గెలిపిస్తాయని నమ్మే బీజేపీ తన ఫేక్ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి విజయం సాధించేందుకు సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగించుకోవాలని ప్రణాళికలు వేస్తోంది. ఆ పార్టీ జాతీయ కార్యదర్శి బీఎల్ సంతోష్ ఈ మేరకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఒక్కో పార్లమెంటు సెగ్మెంట్లో 3 వేల వాట్సాప్ గ్రూప్‌లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వాటి ద్వారా పార్టీ విధానాలతో పాటు ప్రతిపక్షాలే టార్గెట్‌గా సందేశాలు, వీడియోలు పోస్టు చేయాలని సోషల్ మీడియా టీమ్‌లకు దిశానిర్దేశం చేశారు. యూపీలోని లక్నోలో ఆదివారం జరిగిన సమావేశంలో సోషల్ మీడియా టీం టాస్క్‌లు, లక్ష్యాలను వివరించారని ఓ జాతీయ పత్రిక పేర్కొంది. గత ఎన్నికల్లో యూపీలో 2 లక్షల వాట్సాప్ గ్రూపులను వాడగా, ఈ ఏడాది కనీసం 3 లక్షల గ్రూప్‌ల ద్వారా ప్రజలకు చేరువ కావాలని ఆయన చెప్పారు.
బీఎల్ సంతోష్ అసంతృప్తి…
సోషల్ మీడియా పనితీరుపై ఆ పార్టీ జాతీయ కార్యదర్శి బీఎల్ సంతోష్ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు, ఎన్నికలు సమీపిస్తున్నందున ఉత్సాహంతో పని చేయాలని ఆదేశించినట్టు తెలుస్తున్నది. సోషల్ మీడియా వేదికగా బీజేపీ, దాని అనుబంధ సంస్థలు అర్ధ సత్యాలను ప్రచారం చేస్తూ మత విశ్వాసాల పేరిట ఒక వర్గం వారిని తమ వైపునకు తిప్పుకుంటున్నదని బీబీసీ పరిశోధనలో తేటతెల్లమైన విషయం తెలిసిందే.