Shashi Tharoor : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు (US president) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తో న్యూయార్క్ మేయర్ జొహ్రాన్ మమ్దానీ (Johran Mamdani) ఇటీవల భేటీ అయ్యారు. వీరి మధ్య జరిగిన ఈ స్నేహపూర్వక సమావేశంపై కాంగ్రెస్ ఎంపీ (Congress MP) శశి థరూర్ (Shashi Tharoor) ‘ఎక్స్’లో ఆసక్తికర పోస్ట్ పెట్టారు.
ఎన్నికల సమయంలో ఆ ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నప్పటికీ.. ఆ తర్వాత సామరస్యంగా కలవడంపై అభినందనలు తెలిపారు. వారి భేటీకి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ప్రజాస్వామ్యం అంటే ఇలా పనిచేయాలని పేర్కొన్నారు. ఎన్నికల్లో మీ సిద్ధాంతం, భావజాలం కోసం ఎంతవరకైనా పోరాడాలని, కానీ ప్రజలు తీర్పు చెప్పిన తర్వాత దేశ ప్రయోజనాల కోసం ఒకరికొకరు సహకరించుకోవాలని అభిప్రాయపడ్డారు.
ఇలాంటి స్ఫూర్తిని తాను భారతదేశంలో కూడా చూడాలని కోరుకుంటున్నానని థరూర్ పేర్కొన్నారు. ఈ విషయంలో తన వంతు కృషి చేయడానికి ప్రయత్నిస్తున్నానని తెలిపారు. దేశంలో వివిధ పార్టీల మధ్య సహకారం లేకపోవడాన్ని పరోక్షంగా విమర్శించేందుకే థరూర్ ఈ వ్యాఖ్యలు చేశారని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు ఈ వ్యాఖ్యలను తన సొంత పార్టీ కాంగ్రెస్ వైఖరిని ఉద్దేశించి చేసిన పరోక్ష విమర్శగా బీజేపీ నాయకులు పేర్కొన్నారు. ఆ పార్టీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా మాట్లాడుతూ.. గాంధీ కుటుంబం కోసం కాకుండా దేశం కోసం పనిచేయాలని థరూర్ పరోక్షంగా కాంగ్రెస్ నాయకులకు చురకలంటించారని వ్యాఖ్యానించారు.